ఈసా వాగు వరద ముంపు పరిష్కారమెన్నడు ?
ఈసా వాగు వరద ముంపు పరిష్కారమెన్నడు ?
ముంపు నుంచి రక్షించండి .... రైతులను, పొలాలను కాపాడండి ....
రైతులకు ఎంతో ఉపయోగపడాల్సిన వాగు నీరు, నేడు అదే ఒక సమస్యగా మారిన దుస్థితికి సంబంధించిన కథనం మీకు తెలుసా ? ఆ రైతులు - రంగారెడ్డి జిల్లా రైతులు. ఆ వాగు - ఈసా వాగు. ఆయా ప్రాంతాలు - శంషాబాద్, ఇతర మండలాలు.
మన రాష్ట్రంలో నిరంతరం వర్షాభావం నెలకొని ఉండే జిల్లాలలో మన రంగారెడ్డి జిల్లా ఒకటి. ఇటువంటి ప్రాంతంలో ఉండే నీటి వనరులను చాల జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం గురించి ఎవరు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొనివుంది. రైతులకు ఎంతో ఉపయోగపడాల్సిన ఈసా వాగు, సక్రమ నిర్వహణలేక నెడు అదే ఒక సమస్యగా రైతులకి మారింది. ఈసా వాగు పారే పరిధిలో అనేక కిలోమీటర్ల మేర వాగు పూడికతీత పనులు సక్రమంగా జరగడం లేదు. ఈసా వాగుని ప్రత్యక్షంగా చూసే వారందరికీ ఈ విషయం చాల స్పష్టంగా అర్ధమవుతుంది. దీర్ఘకాలికంగా ఈ పూడికతీత పనులు జరగనందువల్ల వాగు పారే పరిధిలో పెద్ద పెద్ద మట్టి దిబ్బలు నేడక్కడ దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా, వాగులో మట్టి విపరీతంగా పేరుకుపోయి వాగు విస్తీర్ణం, లోతు కూడా నేడు చాలా దారుణంగా తగ్గిపోయింది. దీనివల్ల వాగు కుంచించుకు పోయి నీటి నిల్వ సామర్ధ్యం దారుణంగా పడిపోయింది. వీటన్నిటి కారణాన వర్షాకాలం వస్తుందంటేనే అక్కడి రైతులకు విపరీతమైన భయం మొదలవుతున్నది. వర్షపు నీరు ఈ వాగులో సరిగా పారలేక, వాగు పొంగిపోతున్నది. ఆ వరదనీరు వాగు చుట్టు పక్కల ప్రాంతాల పొలాలను ముంచెత్తుతున్నది. అంతేకాకుండా, ఆయా పరిసర ప్రాంతాలలో వున్న మనుషులు కూడా అందులో చిక్కుకుని పోతున్నారు. గతంలో ఒకసారి ఇలాంటి దుర్ఘటన జరిగినపుడు జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని ఒక రెస్క్యూ ఆపరేషన్ కూడా నిర్వహించారు. ప్రత్యేకంగా ఒక లైఫ్ బోటును పంపి ఆయా బాధిత ప్రజలను రక్షించారు. వినడానికి ఇదేంతో ఆశ్చర్యంగా వున్నా, ఇది అక్కడి సమస్య తీవ్రతను మనకు తెలియచేస్తుంది.
ఈ సమస్యనుంచి తమను కాపాడాలని కోరుతూ అక్కడ వాగు పరిధిలోని అనేక గ్రామాల పంచాయితీలు కూడా గతంలోనే తమ తమ గ్రామా సభలలో ఏకగ్రీవ తీర్మానాలను కూడా చేసి, ప్రభుత్వాలకు విన్నవించుకున్నాయి. ఆ మేరకు జిల్లా నీటి పారుదల అధికారులు కూడా వాగు మరమ్మత్తు పనుల కోసం 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక నివేదికను కూడా పై అధికారులకు ఇచ్చారని సమాచారం. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఈసా వాగు సమస్య నేటికీ అలానే వుంది. మరమత్తు పనులు నేటికి ఒక్క ఇంచు కూడా ముందుకు సాగలేదు.
2014లోనే స్వరాష్ట్రం సాధించుకుని, అధికారంలోకి రైతు ప్రభుత్వం వచ్చినా తమ గోడు వినేవారు ఎవరు లేరా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయని వారు అడుగుతున్నారు. మిషన్ కాకతీయ వంటి మంచి పథకాలతో రాష్ట్రవ్యాపితంగా వేల ఎకరాలకు నీరు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాంత సమస్యను కూడా రాబోవు వానాకాలం వచ్చేలోపే పరిష్కరించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.
ఇప్పుడు అక్కడి రైతుల ఘోష ఒక్కటే - ఈసా వాగు వరద ముంపు నుంచి తమను కాపాడు ఈశా ...మహేశా... !
