కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లపై కీలక ప్రకటన...ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ

సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 17న జరిగిన ఆదివాసీ, బంజారా ఆత్మీయసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లపై కీలకమైన ప్రకటన చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ రిజర్వేషన్​ల అమలు దిశగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

10 శాతానికి పెంచుతూ నోటిఫికేషన్ రాష్ట్రంలో విద్యా - ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు రిజర్వేషన్ పది శాతం అమలు తక్షణం అమల్లోకి వచ్చేలా ఈ నోటిఫికేషన్ జారీ అయింది. గిరిజనులకు 10 శాతం అమలు ప్రకటన చేసిన సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తాము ఇచ్చే జీవో అమలు చేస్తావో..లేక దానితో ఉరి వేసుకుంటావో ఆలోచించుకో అంటూ హెచ్చరించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..కేంద్రం వ్యవహరింబోయే విధానం పైన రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు అమ‌ల‌వుతున్న ఆరు శాతం రిజ‌ర్వేష‌న్ల విధానాన్నే తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేస్తూ వ‌చ్చింది. తాజా నోటిఫికేషన్ తో పది శాతానికి పెరగనుంది. రాష్ట్రంలో గిరిజ‌నుల జ‌నాభాకు అనుగుణంగా వారి రిజ‌ర్వేష‌న్ 10 శాతానికి పెంచాల‌ని ఇంత‌కుముందే రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

70 శాతానికి చేరిన రిజర్వేషన్లు ఇందుకోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్ర‌ప‌తి అనుమ‌తి కోసం కేంద్రానికి పంపింది. ఏడేండ్లు దాటినా గిరిజ‌నుల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ల బిల్లుకు కేంద్రం నుంచి ఆమోదం రాలేదు. దీని పైన టీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో కేంద్రం పైన విమర్శలు చేసారు. ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. తాజా రిజర్వేషన్ల నిర్ణయం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు మొత్తంగా 70 శాతానికి చేరింది. ఇదే సమయంలో తెలంగాణలో మొత్తం రిజ‌ర్వేష‌న్లు 1994లో 50 శాతాన్ని దాటి 69 శాతానికి పెరిగిపోయిన అంశాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించిన త‌ర్వాతే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. కేంద్రం ఆమోదం పైనే ఉత్కంఠ గ‌త 28 సంవత్సరాలు గా త‌మిళ‌నాడులో 69 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌ల్లోనే ఉన్నాయి. త‌మిళ‌నాడులో పెరిగిన రిజ‌ర్వేష‌న్ల‌ను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చ‌డం ద్వారా కేంద్రం.. రాజ్యాంగ బ‌ద్ధ‌త క‌ల్పించింది.

గతంలో.. గిరిజనుల స్థితిగ‌తుల‌పై అధ్య‌య‌నానికి తెలంగాణ ప్ర‌భుత్వం చెల్ల‌ప్ప క‌మిటీని నియ‌మించింది. గిరిజ‌నుల అభివృద్ధి కోసం వారికి విద్యా సంస్థ‌ల్లో విద్యాభ్యాసం, ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాల్లో రిజ‌ర్వేష‌న్లు పెంచ‌డం ఒక్క‌టే ప‌రిష్కార మార్గం అని రాష్ట్ర ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందీ..రిజర్వేషన్ల అమలు నిర్ణయం లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది.