వారంలో 8 కొత్త వైద్య కాలేజీలకు టెండర్లు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలకు వారం రోజుల్లో రోడ్లు భవనాల శాఖ టెండర్లు పిలవనుంది. కొత్త మెడికల్‌ కాలేజీ భవన డిజైన్లు ఇప్పటికే ఖరారు అయ్యాయి. ఒక్కో మెడికల్‌ కాలేజీని నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. కేవలం 18 మాసాల్లో వీటి నిర్మాణం పూర్తి చేయాలని షరతు పెట్టనున్నట్లు సమాచారం. అవసరమైతే 15 నెలలకు కూడా కుదించే అవకాశం ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, సంగారెడ్డి, జగిత్యాల,మహబూబాబాద్‌, రామగుండంలో ఈ మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి, వాటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఒక్కో కాలేజీ భవన నిర్మాణ సముదాయానికే రూ.110 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఫర్నిచర్‌, మెడికల్‌ ఎక్వి్‌పమెంట్స్‌కు అయ్యే ఖర్చు అదనం. వెరసి ఒక్కో కాలేజీ నిర్మాణానికి సగటున రూ. 500 కోట్లు ఖర్చుకానుంది. 

నెలాఖరులోగా టెండర్లురాష్ట్ర రాజధానిలో ఆరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో నాలుగింటికి ఈనెలాఖరుకు టెండర్లు పిలవనున్నారు. వీటి నిర్మాణ బాధ్యతలను కూడా ప్రభుత్వం ఆర్‌ అండ్‌బీకే అప్పగించింది. ఇందులో నిమ్స్‌, గచ్చిబౌలీలోని టిమ్స్‌ను విస్తరించనున్నారు. గడ్డి అన్నారం, అల్వాల్‌, చెస్ట్‌ ఆస్పత్రి ప్రాంగణంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించనున్నారు. ఎయిమ్స్‌ తరహాలో వీటిని నిర్మించాలని సర్కారు భావిస్తోంది. జాతీయ వైద్యమండలి నిబంధనల మేరకు వీటిని నిర్మించనున్నారు. ఒక్కో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోతున్నారు.

వీటిని కూడా ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెండరు నిబంధనల్లో కూడా అదే విషయాన్ని పెట్టబోతున్నారు. కాగా ఒక్కో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో 1200 పడకలుండేలా డిజైన్‌ చేశారు. ఒక్కో దానికి రూ. 900 కోట్లు అవుతుందని అంచనా. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ బాధ్యతలను కూడా ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకే అప్పగించింది. ఉస్మానియా ఆస్పత్రి భవనాల కూల్చివేత అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. దీనిపై ఉన్నత న్యాయస్థానం ఒక కమిటీ వేసింది. కూల్చివేయాలా వద్దా అన్న అంశంపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. దాని ఆధారంగా హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ కూల్చివేయాలని చెప్పినా...లేక ఉన్నదాన్ని అలాగే ఉంచి విస్తరించాలని చెప్పినా... ఆర్‌అండ్‌బీ నే చూసుకోవాలని సర్కారు సూచించింది.