
CM KCR : గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, భూమి లేని వారికి రూ. 10 లక్షల ఆర్థికసాయం - సీఎం కేసీఆర్
CM KCR : తెలంగాణలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆదివారం ఎన్టీఆర్ మైదానంలో ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ పాల్గొ్న్నారు. ఈ సభలో మాట్లాడిన ఆయన తెలంగాణ కోసం 58 ఏళ్ల పోరాటం చేశామన్నారు. గిరిజన రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఏడేళ్లు గడుస్తుందని, ఇప్పటికే కేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రధాని మోదీకి చేతులు జోడించి అడుగుతున్నా గిరిజన రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతితో ఆమోదం తెలపాలని కోరారు. వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు ఇస్తామన్నారు.
"తెలంగాణలో విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చి రాజకీయాలు చేస్తున్న అమిత్ షాను అడుగుతున్నా ఎందుకు గిరిజన రిజర్వేషన్ బిల్లును తొక్కిపెడుతున్నారు. ప్రధాని మోదీని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. మా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి పంపించండి. దానిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్లు పెంచకూడదని లేదు. తమిళనాడులో 50 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తున్నారు. తెలంగాణకు ఇచ్చేందుకు ఎందుకు చేతులు రావడంలేదు. చిల్లర రాజకీయాలు చేస్తున్న నేతలను అడుగుతున్నా వారికి ఎందుకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు. గిరిజనులు అక్కడక్కడా పోడు వ్యవసాయం చేస్తుంటారు. వారిని గుర్తించడానికి కమిటీలు ఏర్పాటుచేశాం. పోడు భూములు కోసం జీవో 140 విడుదల చేశాం. కమిటీలు అన్ని వివరాలు సేకరించి పంపిస్తే ఆదివాసీలకు పట్టాలు త్వరలోనే అందిస్తాం. వారికి రైతు బంధు కూడా అందిస్తామని ప్రకటిస్తున్నాను. త్వరలోనే గిరిజన బంధును అమలు చేస్తాం. భూమిలేని వారికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తాం. "- సీఎం కేసీఆర్