
‘భగీరథ’ ప్రయత్నం ఫలించిందా..?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ద్వారా 2019 తర్వాత ఎండాకాలంలోనూ పల్లెల్లో తాగునీటి సమస్యలు లేకుండా చేశామని అధికారులు చెబుతు న్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య మిషన్ భగీరథతో తీరిందని చెబు తున్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలతో పాటు తాగునీటి నాణ్యత సరిగా లేని ఇతర ఆవాసాలన్నింటికీ శుద్ధిచేసిన తాగునీటిని తెలంగాణ అందిస్తోందని 2020 సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జలశక్తి శాఖ కూడా ప్రకటించింది.
ఏమిటీ మిషన్ భగీరథ
రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని (ఔటర్ రింగ్ రోడ్ ఆవల) ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షి తమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లా ద్వారా సర ఫరా చేసే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించారు. కృష్ణా, గోదావరి నదులు, ప్రధాన రిజర్వాయర్లు మొదలైన ఉపరితల జల వనరుల నుండి శుద్ధిచేసిన తాగునీటిని అందించాల్సి ఉంది. గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీల్లో అయితే 135 లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 150 లీటర్ల తాగునీరు సరఫరా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు 2015 చివర్లో మొదలుపెట్టిన ఈ పథకాన్ని 2019 కల్లా పూర్తి చేయగలిగామని అధికారులు వెల్లడించారు.
24 గంటల్లోనే సమస్య పరిష్కారం
ప్రతి గ్రామానికీ భగీరథ పైప్‌లైన్ చేరుకుంది. దాదాపుగా వందశాతం గ్రామాల్లోని ఇళ్లకు నల్లాల ద్వారా నీటి సరఫరా అవుతోంది. నీటి సరఫరాలో లేదా ఇతరత్రా ఏవైనా సమస్యలు తలెత్తితే 24 గంటల వ్యవధిలోనే సరిచేస్తున్నాం. లేనిపక్షంలో ఎప్పటిలోగా పరిష్కరిస్తామో చెబుతున్నాము. ఎండాకాలంలో కూడా నీటికొరత ఏర్పడకుండా చూస్తున్నాం. గతంలో షాద్‌నగర్‌లో భూగర్భ జలాలు శూన్యం. నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు కరువు పీడిత ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందజేస్తున్నాం. శుద్ధిచేసిన నీటి కారణంగా గ్యాస్ట్రో ఎంటరైటిస్, ఇతర వ్యాధులు తగ్గిపోయాయి. – కృపాకర్‌రెడ్డి, ఈఎన్‌సీ, మిషన్ భగీరథ
నీటి సమస్య తీరింది..
మా గ్రామంలో రెండేళ్ల కిందటి వరకు తాగునీటికి ఇబ్బందులు పడ్డాం. కి.మీల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీ ట్యాంకు వద్దకు పోయి నీటిని తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు మిషన్ భగీరథ నీరు వస్తుండటంతో తాగునీటి సమస్య తీరింది. రోజూ ఉదయం గంటన్నర సేపు నీళ్లొస్తున్నాయి.
– చెన్నమ్మ, మంచాలకట్ట,పెంట్లవెల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా