
ద్వేషం కాదు దేశం ముఖ్యం, ఈ కుట్రను కనిపెట్టకపోతే..
హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా బీజేపీ వైఖరి, విధానాలపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్నది మోదీ ప్రభుత్వం కాదని, ఏడీ(అటెన్షన్ డైవర్షన్) ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరగుతోందని ఆరోపించారు. మండిపోతున్న పెట్రో ధరల నుంచి, భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికే, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందన్నారు. దేశం కోసం, ధర్మం కోసం అనేది బీజేపీ అందమైన నినాదం మాత్రమేనని.. విద్వేశం కోసం, అధర్మం కోసం అనేది అసలు రాజకీయ విధానమని తెలిపారు.
‘హర్ ఘర్ జల్ అన్నారు. కానీ హర్ ఘర్ జహర్. హర్ దిల్ మే జహర్( ప్రతి ఒక్కరి మనసులో, ఇంట్లో విద్వేషం) నింపే కుట్ర చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా దేశంలోని సోషల్ ఫ్యాబ్రిక్‌ను దెబ్బతీసే కుతంత్రం చేస్తున్నారు. ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర చేస్తున్నారు. ద్వేషం కాదు దేశం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యమని తెలుసుకోండి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.