Minister KTR London Tour: లండన్‌కు కేటీఆర్‌

 ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేకతలను వివరించడం లక్ష్యంగా దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (ప్రపంచ ఆర్థిక వేదిక) సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్‌ మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ఐటీ, పరిశ్రమల శాఖ అధికారుల బృందం వెళ్లింది. బుధవారం ఉదయం లండన్‌కు కేటీఆర్‌ చేరుకోనున్నారు. 4 రోజులు అక్కడే ఉంటారు.

ఈ నెల 18 నుంచి 21 వరకు యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్, తెలంగాణ ప్రభు త్వం భాగస్వామ్యంతో జరిగే వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆటోమోటివ్‌ పరిశ్రమల దిగ్గజ సంస్థలతో భేటీ అవుతారు. 

ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ 
ఆ తర్వాత వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్‌ బయలుదేరి వెళ్తారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సదస్సులో పాల్గొంటారు. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రముఖ కంపెనీల సీఈవోలు, యాజమాన్యాలతో భేటీ అవుతారు. సీఈవో స్థాయి సమావేశాలు, చర్చాగోష్టులు, ప్రాజెక్టులు, వర్క్‌ షాప్‌ల్లో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 35 మంది ప్రముఖులతో వ్యక్తిగతంగా భేటీ అవుతారు.

తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా సమావేశాలు ఉంటాయని ఆయన వెంట వెళ్లిన అధికారులు తెలిపారు. భారత్‌ నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు దావోస్‌ సదస్సులో పాల్గొనను న్నారు. సదస్సు తర్వాత ఈ నెల 27న కేటీఆర్‌ రాష్ట్రానికి చేరుకుంటారు.