హైదరాబాద్‌ నాలుగు దిక్కులా వైద్యం.. రూ.2,679 కోట్లతో 3 టిమ్స్ నిర్మాణం

తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంగా హైదరాబాద్‌కు నాలుగు దిక్కులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం రూ.2,679 కోట్లు కేటాయించింది.

హైదరాబాద్‌ మహానగరం నలుదిక్కులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని గతంలో ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు కీలక ముందగుడు వేసింది. కొవిడ్‌ సమయంలో గచ్చిబౌలి క్రీడా గ్రామంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(టిమ్స్‌) ఆసుపత్రికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అక్కడ 1500 పడకలు అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో మూడింటికి పరిపాలన అనుమతులు ఇవ్వడంతో ప్రభుత్వ ప్రకటన ఆచరణలోకి రానుంది. సూపర్ స్పెషాలిటీలను టిమ్స్‌ పేరుతో కొనసాగిస్తూనే స్వయం ప్రతిపత్తి కల్పించనున్నారు. ఈ క్రమంలోనే రూ.2,679 కోట్లతో 3 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లో రూ.900 కోట్లతో, హైదరాబాద్‌ జిల్లా సనత్‌నగర్‌లో రూ.882 కోట్లతో, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లో రూ.897 కోట్లతో వీటిని నిర్మించడానికి ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆస్పత్రుల నిర్మాణాలకు టెండర్లు పిలవాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించారు. ఒక్కో టిమ్స్‌ విస్తీర్ణాన్ని 13,71,220 చదరపు అడుగులుగా నిర్ణయించారు. ఇందులో 10,53,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి, 3,17,420 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనుబంధ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రతి భవనాన్ని ‘టర్న్‌కీ’ ప్రాతిపదికన నిర్మిస్తారు. ప్రభుత్వ వైద్య సేవలకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల రోగులు నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపైనే ఆధారపడుతున్నారు. కొత్త ఆసుపత్రుల నిర్మాణంతో నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల రోగులకు మరింత సులభంగా, సత్వరమే స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందించనున్నారు. దీంతో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గనుంది.