బిహార్ పర్యటనలో.. ముఖ్యమంత్రి కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. బిహార్ పర్యటనలో బిజీగా ఉన్నారు. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా జవాన్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో అమరులైన వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆయన బిహార్ వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో భేటీ అయ్యారు. జాయింట్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

ప్రెస్‌మీట్ ముగిసిన అనంతరం కేసీఆర్ నేరుగా రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌, రబ్రీదేవి దంపతులను కలుసుకున్నారు. తమ నివాసానికి వచ్చిన కేసీఆర్‌ను రబ్రీదేవి శాలువ కప్పి గౌరవించారు. లాలూ ప్రసాద్‌తో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వారిద్దరి మధ్య రాజకీయాల గురించి ప్రస్తావన పెద్దగా రాలేదు. కేంద్రంలో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని లాలూ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

కొద్దిరోజుల కిందట లాలూ ప్రసాద్ మెట్ల మీది నుంచి జారి పడ్డ విషయం తెలిసిందే. దీనితో ఆయనకు తేలికపాటి ఫ్రాక్చర్లయ్యాయి. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. ప్రస్తుతం పాట్నాలో విశ్రాంతి తీసుకుంటోన్నారు. కేసీఆర్‌కు స్వాగతం పలికిన వారిలో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నారు.

అనంతరం కేసీఆర్ పాట్నాలోని గురుద్వారాను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఆయన వెంట డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. కేసీఆర్‌కు గురుద్వారా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఆయనకు తలపాగాను ధరింపజేశారు. గులాబీ రంగ పగిడీతో కేసీఆర్ కనిపించారు. అనంతరం కృపాణ్‌ను అందజేశారు.

ఎన్డీఏ, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు కేసీఆర్. దేశవ్యాప్తంగా ప్రతిపక్షపార్టీల నాయకుల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా ఇదివరకు ఆయన హేమంత్ సోరెన్, ఉద్దవ్ థాకరే, శరద్ పవార్, స్టాలిన్‌లను కలుసుకున్నారు. ఇప్పుడు తాజాగా నితీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు కేసీఆర్.