సన్‌రైజర్స్‌ బోణీ

ముంబై: ఐపీఎల్‌లో సన్‌రైజన్స్‌ హైదరాబాద్‌ బోణీ కొట్టగా.. డిఫెండింగ్‌ చాంప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75) అర్ధ శతకంతోపాటు.. బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 8 వికెట్ల తేడాతో చెన్నైను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 154/7 స్కోరు చేసింది. మొయిన్‌ అలీ (48) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అంబటి రాయుడు (27) ఫర్వాలేదనిపించాడు. సుందర్‌, నటరాజన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్‌ 17.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి నెగ్గింది. రాహుల్‌ త్రిపాఠి (15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్‌) ధాటిగా ఆడాడు. చెన్నై ప్లేఆఫ్స్‌ చేరాలంటే మిగిలిన 10 మ్యాచ్‌ల్లో కనీసం 8 మ్యాచ్‌లు నెగ్గాల్సిన పరిస్థితి. 

ఆడుతూ పాడుతూ..: సన్‌రైజర్స్‌ ఛేదనలో 21 ఏళ్ల అభిషేక్‌ ఆటే హైలైట్‌. ఎంతో అనుభవం ఉన్న కెప్టెన్‌ విలియమ్సన్‌ (32) ఓ ఎండ్‌లో ఉండడంతో.. చెన్నై బౌలర్లను ఓ ఆటాడుకుంటూ స్కోరు బోర్డును నడిపించాడు. పవర్‌ ప్లే ముగిసే సరికి సన్‌రైజర్స్‌ 37/0తో నిలిచింది. అలీ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన విలియమ్సన్‌ టీమ్‌ స్కోరును హాఫ్‌ సెంచరీ మార్క్‌ దాటించాడు. జోర్డాన్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకున్న శర్మ మరింత ధాటిగా ఆడాడు. కాగా, విజయానికి 48 బంతుల్లో 66 పరుగులు కావాల్సి ఉండగా.. విలియమ్సన్‌ను అవుట్‌ చేసిన ముఖేష్‌ తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఈదశలో సెటిల్డ్‌ బ్యాటర్‌ అభిషేక్‌కు త్రిపాఠి జత కలవడంతో.. ఛేదన టాప్‌ గేర్‌లో సాగింది. జోర్డాన్‌ వేసిన 17వ ఓవర్‌లో చెలరేగిన త్రిపాఠి 19 పరుగులు రాబట్టాడు. 18వ ఓవర్‌ తొలి బంతికి అభిషేక్‌ను బ్రావో అవుట్‌ చేసినా.. త్రిపాఠి బౌండ్రీతో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు.

తడ‘బ్యాటు’..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్‌ రాబిన్‌ ఊతప్ప (15) ఫోర్‌తో ఖాతా తెరిచినా.. షాట్లు ఆడేందుకు ఇబ్బందులుపడ్డాడు. మూడో ఓవర్‌లో సుందర్‌ వేసిన తొలి బంతిని స్వీప్‌ చేయబోయి.. మార్‌క్రమ్‌కు చిక్కాడు. మరో ఓపెనర్‌ రుతురాజ్‌(16)ను బౌల్డ్‌ చేసిన నటరాజన్‌ షాకిచ్చాడు. ఆ తర్వాత రాయుడు, అలీ పది రన్స్‌ తేడాతో వెనుదిరగడంతో.. చెన్నై బ్యాటింగ్‌ కుదేలైంది. అంబటిని సుందర్‌ అవుట్‌ చేయగా.. మొయిన్‌ను మార్‌క్రమ్‌ బోల్తాకొట్టించాడు. దీంతో చెన్నై 15 ఓవర్లలో 108/4 స్కోరు చేసింది. ఇక దూబే (3)ను నటరాజన్‌.. ధోనీ (3)ని జెన్సన్‌ అవుట్‌ చేశారు. జడేజా (23)ను అవుట్‌చేసిన భువీ.. చెన్నైను ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేశాడు.

స్కోరుబోర్డుచెన్నై: ఊతప్ప (సి) మార్‌క్రమ్‌ (బి) సుందర్‌ 15, రుతురాజ్‌ (బి) నటరాజన్‌ 16, మొయిన్‌ అలీ (సి) త్రిపాఠి (బి) మార్‌క్రమ్‌ 48, అంబటి రాయుడు (సి) మార్‌క్రమ్‌ (బి) సుందర్‌ 27, దూబే (సి) ఉమ్రాన్‌ (బి) నటరాజన్‌ 3, జడేజా (సి) విలియమ్స్‌ (బి) భువనేశ్వర్‌ 23, ధోనీ (సి) ఉమ్రాన్‌ మాలిక్‌ (బి) జెన్సన్‌ 3, బ్రావో (నాటౌట్‌) 8, జోర్డాన్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 154/7; వికెట్ల పతనం: 1-25, 2-36, 3-98, 4-108, 5-110, 6-122, 7-147; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-36-1, జెన్సెన్‌ 4-0-30-1, సుందర్‌ 4-0-21-2, నటరాజన్‌ 4-0-30-2, ఉమ్రాన్‌  3-0-29-0, మార్‌క్రమ్‌ 1-0-8-1. 
హైదరాబాద్‌:  అభిషేక్‌ శర్మ (సి) జోర్డాన్‌ (బి) బ్రావో 75, విలియమ్సన్‌ (సి) అలీ (బి) ముఖేష్‌ 32, త్రిపాఠి (నాటౌట్‌) 39, పూరన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం 17.4 ఓవర్లలో 155/2; వికెట్ల పతనం: 1-89, 2-145;  బౌలింగ్‌: ముఖేష్‌ 4-0-30-1, తీక్షణ 4-0-31-0, జోర్డాన్‌ 3-0-34-0, జడేజా 3-0-21-0, మొయిన్‌ అలీ 1-0-10-0, బ్రావో 2.4-0-29-1.