టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. కన్నీటి పర్యంతమైన ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌ భావోద్వేగం

క్రీడాభిమానులు కలకాలం గుర్తుంచుకునే సందర్భం. ఆటలో ఉన్న అద్భుతాన్ని ఆవిష్కరించిన వైనం. సుదీర్ఘ కాలం పాటు తన అసమాన ఆటతీరుతో కోట్లాది మంది ప్రేక్షకులను మదిని దోచిన టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. లేవర్‌ కప్‌లో భాగంగా సహచర ప్లేయర్‌ రఫెల్‌ నాదల్‌తో టీమ్‌ యూరప్‌ తరఫున డబుల్స్‌ బరిలోకి దిగిన ఫెదరర్‌ ఓటమి ఎదుర్కొన్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో లెక్కకు మిక్కిలి విజయాలతో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను దక్కించకున్న ఫెదరర్‌ తన ఆఖరి ఆటను ఓటమితో ముగించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఈ స్విస్‌ దిగ్గజం భావోద్వేగానికి లోనయ్యాడు. పసిపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తూ ఆటపై తన మక్కువను చాటుకున్నాడు. సై అంటే సై అంటూ కొదమసింహాల్లా కొట్లాడిన నాదల్‌.. ఫెదరర్‌ వీడ్కోలు వేళ కన్నీటి పర్యంతమయ్యాడు.

 సుదీర్ఘ టెన్నిస్‌ కెరీర్‌కు స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ వీడ్కోలు పలికిన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో స్పందించారు. లేవర్‌కప్‌ వీడియోను రీట్వీట్‌ చేస్తూ ‘ఈ రోజు మీరు ఏమైనా చూడాలనుకుంటే..దీన్ని చూడాల్సిందే’ అంటూ కేటీఆర్‌ రాసుకొచ్చారు. తన అద్భుత ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన ఫెదరర్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకడంతో పలువురు ప్రముఖులు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.