
ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ విజయం
Asia Cup 2022 India Vs Pakistan: ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన సమయంలో వికెట్లు తీయడంతో పాటుగా లక్ష్య ఛేదనలో ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్‌లో హార్దిక్ ఆత్మవిశ్వాసంతో ఆడిన తీరు అభిమానుల మనసు గెలుచుకుంది.
బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా ఆఖరి ఓవర్ మొదటి బంతికి నిష్క్రమించిన తర్వాత ‘ఫినిషర్’ దినేశ్ కార్తిక్ క్రీజులోకి వచ్చాడు. సింగిల్ తీసి హార్దిక్‌కు స్ట్రైక్ రొటేట్ చేశాడు. అప్పటికి టీమిండియా గెలుపు సమీకరణం 4 బంతుల్లో 6 పరుగులు. ఆ మరుసటి బంతి డాట్‌బాల్. మిగిలినవి రెండే బంతులు.. నరాలు తెగే ఉత్కంఠ.
నరాలు తెగే ఉత్కంఠ
అయినా పాండ్యా తడబడలేదు.. ఆఖరి ఓవర్ నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. కూల్‌గా తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి ప్రపంచకప్-2021లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేలా చేశాడు. ఇక అప్పటిదాకా నరాలు బిగపట్టి మ్యాచ్ చూస్తున్న అభిమానులు ఈ పరిణామంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. పాండ్యాకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొన్నారు.
టేక్ ఏ బో!
ఇక ఈ అద్భుత ఫినిషింగ్ టచ్‌ను నేరుగా వీక్షించిన డీకే సైతం పాండ్యా ముందు తలవంచి హృదయపూర్వకంగా అతడికి అభినందనలు తెలిపాడు. సహచర ఆటగాడికి ఎంతో హుందాగా శుభాకాంక్షలు తెలియజేశాడు. డీకే రియాక్షన్‌కు ఏమనాలో అర్థం కాని హార్దిక్ చిన్నగా నవ్వుతూ కళ్లతోనే బదులిచ్చాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఫినిషింగ్ టచ్ విలువ ఇంకో ఫినిషర్‌కే తెలుస్తుంది.. హార్దిక్ ఆటతో మా హృదయాలు గెలుచుకుంటే.. దినేశ్ కార్తిక్ తన సంస్కారంతో మనసులు కొల్లగొట్టాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది.. ‘‘దండాలయ్యా మాకోసం నువ్వు ఉన్నావయ్యా హార్దిక్’’ అంటూ సినిమాటిక్ స్టైల్లో ఈ వీడియోపై కామెంట్ చేస్తున్నారు.