
ఉత్కంఠ రేపుతున్న వీసా సమస్య.. ఫ్లోరిడాకు చేరుకోని భారత ఆటగాళ్లు!
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. లగజీ సమస్య మొదలుకొని వీసా వరకు టీమిండియా ఆటగాళ్లను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఇక ఫ్లోరిడాలో జరగనున్న టి20 మ్యాచ్‌లు.. ప్రారంభానికి ముందే పెద్ద థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. మ్యాచ్‌లో చోటు చేసుకోవాల్సిన ఉత్కంఠ.. వీసాల రూపంలో టీమిండియా ఆటగాళ్ల వెంట పడుతుంది. నేరుగా ఫ్లోరిడా వెళ్లే అవకాశం లేకపోవడంతో ముందుగా ఇరుజట్లను గయానాకు పంపించారు. అక్కడి అమెరికా ఎంబసీ వీసాలు ఇవ్వడంలో అభ్యతంరం చెప్పడంతో సమస్య మొదటికి వచ్చింది.
దీంతో బుధవారం గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ చొరవతో ఆటగాళ్ల వీసా సమస్య క్లియర్ అయింది. ఇక శుభం అని మనం అనుకునే లోపే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. గురువారం రెండు జట్లు ప్లోరిడాకు బయలుదేరగా కొంతమంది ఆటగాళ్లు మాత్రం విండీస్‌లోనే ఉండిపోయారంట. ఆ మిగిలిపోయిన ఆటగాళ్లు కూడా టీమిండియా సభ్యులేనట. ఫ్లోరిడాకు చేరుకున్న వారిలో విండీస్ ఆటగాళ్లు మొత్తం ఉండగా.. భారత్ జట్టులో సగం మంది మాత్రమే ఉన్నారు.
మిగతా సగం వీసా సమస్యలతో వెస్టిండీస్‌లోనే ఆగిపోయారనే వార్తలు వస్తున్నాయి. అయితే టీమిండియాలోని మిగిలిన ఆటగాళ్లు ఈరోజు బయలుదేరుతారని.. మ్యాచ్‌లు జరుగుతాయని విండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది. కాగా ఒక టీమిండియా అభిమాని మాత్రం ''బ్రేకింగ్ న్యూస్.. టీమిండియా పూర్తిస్థాయి జట్టు ఫ్లోరిడాకు చేరుకోలేదు.. మ్యాచ్‌లు ప్రశ్నార్థకమేనా?'' అంటూ ట్వీట్ చేశాడు.
ఇక ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఫ్లోరిడా వేదికగా ఆగస్టు 6, 7 తేదీల్లో నాలుగు, ఐదు టి20లు జరగనున్నాయి. ఒకవేళ సకాలంలో ఆటగాళ్లు చేరుకోలేకపోతే.. మ్యాచ్‌లు ఒకరోజు వాయిదా వేసే అవకాశం ఉందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నాయి. అయితే విండీస్ సిరీస్ ముగించుకొని టీమిండియా జట్టులోని సీనియర్లు మినహా మిగిలిన ఆటగాళ్లు వెంటనే జింబాబ్వే పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే విండీస్‌తో మిగతా టి20లు ప్రశ్నార్థకంగా మారాయనే చెప్పొచ్చు.