విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే..

టీమిండియా(Team India) స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్‌లేమితో నానా తంటాలు పడుతున్నాడు. విశ్రాంతి దృష్ట్యా ప్రస్తుతం వెస్టిండీస్‌ సిరిస్‌(West Indies)లో ఆడడం లేదు. అయితే ఆగస్టు చివరిలో యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా టీ20 కప్‌(Asia T20 Cup)లో ఆడనున్నాడు. పరుగులు చేయలేక ఇబ్బందులతో జట్టులో చోటుపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆసియా టీ20 కప్‌, టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup)లలో భారత్ గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని కోహ్లీ చెప్పాడు. ఈ 2 కప్‌లను భారత జట్టు గెలవడంలో తనవంతు సహకారం అందించడమే తన ముందున్న లక్ష్యమని వివరించారు. అందుకోసం జట్టుకోసం ఏం చేయడానికైనా సిద్ధమని కోహ్లీ చెప్పినట్టు ‘స్టార్‌స్పోర్ట్స్’ పేర్కొంది. ఏ ఉద్దేశ్యంతో కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడనేదిదానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కాగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ఆరంభమవుతుంది. స్టార్‌ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్‌లలో ప్రసారమవనుంది.

33 ఏళ్ల విరాట్ కోహ్లీ ఆసియా కప్‌లో చివరిసారిగా 2016లో ఆడాడు. ఇటివల ముగిసిన ఇంగ్లండ్‌ పర్యటనలో ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సిరీస్‌లో చివరిదైన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో మొదటి, రెండవ ఇన్నింగ్స్‌లలో 11, 20 చొప్పున పరుగులు చేశాడు. టీ20ల్లోనూ ఇతే తంతు కొనసాగింది. 2 మ్యాచులు ఆడి కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఇదే ఫలితం కనిపించింది. 2 మ్యాచులు ఆడి 17, 16 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2022లోనూ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.