Pv Sindhu: పీవీ సింధు సంచలనం... క్వార్టర్స్ లో థాయ్‌లాండ్ స్టార్ షట్లర్ పై ఘనవిజయం

Pv Sindhu: తెలుగు తేజం, భారత  స్టార్ మహిళా షట్లర్ పీవీ సింధు  వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్  ఓపెన్ లో నిరాశ పరిచిన సింధు... అనంతరం జరుగుతున్న టోర్నీల్లో సత్తా చాటుతోంది. గత వారం జరిగిన స్విస్ ఓపెన్ లో విజేతగా నిలిచిన పీవీ సింధు... తాజాగా కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లోనూ టైటిల్ సాధించేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆమె శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో 21-10, 21-16తో థాయ్‌లాండ్  స్టార్ షట్లర్, ఏడో సీడ్ బుసానన్ పై వరుస గేముల్లో గెలుపొందింది. తద్వారా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల విభాగంలోనూ భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్  సెమీఫైనల్లో ప్రవేశించాడు. శుక్రవారమే జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్ లో శ్రీకాంత్ 21-12, 18-21, 21-12తో సాన్ వన్హో (కొరియా)పై పోరాడి గెలిచాడు.

సింధు మ్యాచ్ విషయానికి వస్తే... ఇటీవల జరిగిన పలు టోర్నీల్లో సింధు బుసాన్ చేతిలో ఓడిపోయింది. దాంతో మళ్లీ అదే ఫలితం వస్తుందేమో అని సింధు అభిమానులు భయపడ్డారు. అయితే మ్యాచ్ ఆరంభమయ్యాక కాసేపటికే ఆమె సింధు తన ఆటతీరుతో వాటిని పటాపంచలు చేసింది. ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన ఆమె... ఎక్కడా ప్రత్యర్థికి పుంజుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. కేవలం 43 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో... సింధు వరుస గేముల్లో గెలిచి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. తొలి గేమ్ లో అయితే సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆరంభం నుంచి స్మాష్ షాట్లతో బుసానన్ పని పట్టింది. నెట్ వద్దకు షాట్లు ఆడుతూ... వీలు చిక్కినప్పుడల్లా స్మాష్ షాట్లతో బుసానన్ ను కోలుకోనివ్వకుండా చేసింది. ఇక రెండో గేమ్ లో మాత్రం బుసానన్ ఆటతీరు కాస్త మెరుగుపడింది. ఆమె కూడా పాయింట్లు సాధించడంతో సింధు వెంటే బుసానన్ కూడా సాగింది. అయితే కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన సింధు గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడా సొంతం చేసుకుని సెమీఫైనల్లో అడుగు పెట్టింది. రేపు జరిగే సెమీస్ పోరులో కొరియాకు చెందిన ఆన్ సియాంగ్ తో సింధు తలపడే అవకాశం ఉంది.