F3 : స్పెషల్ సాంగ్‌కు ఆమెనే ఫిక్స్ చేశారు
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్ 3’. సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ప్ లో నిర్మాణం జరుపుకుంటున్నఈ మూవీని మే 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ‘సమ్మర్ సోగ్గాళ్ళు’ అనే ట్యాగ్ లైన్‌తో హిలేరియస్ కామెడీని వర్కవుట్ చేయబోతున్నాడు దర్శకుడు అనిల్. చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా.. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు మేకర్స్. సినిమాకే ఈ పాట హైలైట్ కాబోతోంది. అయితే ఆ పాటలో నర్తించే బ్యూటీ ఎవరన్న విషయంలో ఆసక్తి నెలకొంది. ఆ పాటకు పూజా హెగ్డే నర్తించబోతోందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దానికి ‘ఎఫ్ 3’ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. పూజా హెగ్డేనే ప్రత్యేకగీతానికి ఎంపిక చేసినట్టు మేకర్స్ ట్విట్టర్ లో తెలిపారు. కాకపోతే పూజా హెగ్డేను వెనుక నుంచి చూపించి, ఆమె పేరు ప్రస్తావించకుండా ప్రీలుక్‌గా విడుదల చేశారు. ఆ లుక్‌లో రివీల్ అయింది పూజా అని స్పష్టంగా తెలుస్తోంది.
ఇంతకు ముందు ‘రంగస్థలం’ చిత్రంలో జిగేల్ రాణి పాటతో జిగేల్‌మనిపించిన పూజా హెగ్డే.. ఆ పాటతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి అమ్మడి స్పెషల్ సాంగ్ ఎఫ్ 3 చిత్రానికి హైలైట్ కానుంది. దేవీశ్రీ ప్రసాద్ ఓ క్యాచీ ట్యూన్‌తో ఆ పాటను కంపోజ్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. త్వరలో ఈ పాటను సోషల్ మీడియాలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ పాట ‘ఎఫ్ 3’ చిత్రానికి ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాలి.
