
జపాన్, చైనాలో ప్రగతి..భారత్‌లో మతపిచ్చి
‘1986-87లో భారత్, చైనా దేశాల జీడీపీ 470 బిలియన్ డాలర్లుగా ఒకేవిధంగా ఉండేది.. ఇప్పుడు చైనా జీడీపీ 16 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకితే, మనం అతి కష్టంగా 3.5 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నాం’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘36 ఏళ్ల క్రితం మనతో సమానంగా ఉన్న చైనా.. నేడు మనకంటే ఐదు రెట్లు ముందంజలో ఉండటం వెనుక ఒకే ఒక కారణం.. వాళ్లు ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీపడితే మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో పోటీపడుతున్నాం’ అని అన్నారు. గురువారం బేగంపేటలో జరిగిన క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం 36వ వార్షిక సమావేశం, జేఎన్‌టీయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా జరిగిన అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అణుదాడి, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ పరిమిత వనరులతో జపాన్ నేడు అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. మనం మాత్రం అన్ని వనరులున్నావెనకబడుతున్నామన్నారు. చైనా, జపాన్‌లు పరిశ్రమల స్థాపనపై దృష్టిపెడితే.. మనం కులం, మతం గొడవలతో కొట్టుకు చస్తున్నామన్నారు. వాళ్లు ప్రపంచంలోనే భారీ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టిసారిస్తే.. మనం మాత్రం మందిరాల్ని కూల్చి మసీదుల్ని, మసీదుల్ని కూల్చి మందిరాల నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పుడున్న చిల్లరగాళ్లకు మందిర్, మసీదు గొడవలే అత్యంత ప్రాధాన్యత అంశాలని రాజకీయ పార్టీలను ఉద్దేశిస్తూ విమర్శించారు. గతాన్ని తవ్వుకుంటూ, పాత గాయాలను కెలుక్కుంటూ ఇంకా ఎంతకాలం గతంలోనే బతకుదామని ప్రశ్నించారు. దేశం వృద్ధి చెందాలంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలన్నారు.
భారత్ కంటే శ్రీలంక ఎంతో మెరుగుగూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి అనేక బహుళజాతి సంస్థలకు సీఈవోలుగా భారతీయులున్నారని సంతోషిస్తున్నాం. కానీ.. ప్రపంచం అంతటా వినియోగించే ఒక్క బ్రాండ్‌ను కూడా మనం ఇంతవరకు ఎందుకు తయారుచేయలేకపోయామని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చైనా చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంటే.. కనీసం మాస్కులు కూడా తయారు చేసుకునే స్థితిలో మన దేశం లేదన్నారు. ప్రపంచం మొత్తం టెక్స్‌టైల్ రంగంలో చైనా వాటా 34 శాతంగా ఉంటే, ప్రపంచంలోనే ఎక్కువ పత్తి ఉత్పత్తి చేస్తున్న భారత్ వాటా కేవలం 4 శాతమే అన్నారు. టెక్స్‌టైల్ రంగంలో మనకంటే చిన్నదేశాలైన బంగ్లాదేశ్ 8 శాతం, శ్రీలంక 6.7 శాతంతో ఎంతో ముందున్నాయని అన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి అందమైన నినాదాలకే కేంద్ర ప్రభుత్వం పరిమితమైందని దుయ్యబట్టారు.
రాజకీయాల్లోనూ నాణ్యత అవసరందేశం మొత్తానికి నిరంతర విద్యుత్తు అందించాలంటే 2.12 లక్షల మెగావాట్ల విద్యుత్తు అవసరం. ప్రస్తుతం దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవసరమయ్యే ఏర్పాట్లు ఉన్నా.. ప్రతీ ఇంటికీ విద్యుత్తు మాత్రం అందటం లేదన్నారు. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా దేశంలో ఇంకా విద్యుత్ లేని గ్రామాలు, నల్లా లేని గృహాలు ఉన్నాయంటే పాలకులు సిగ్గు పడాలన్నారు. నాణ్యత అనేది వస్తు ఉత్పత్తులోనే కాకుండా.. రాజకీయాల్లోనూ ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
త్రీ ఐ నినాదంతోనే మేకిన్ ఇండియా మేకిన్ ఇండియా కావాలంటే త్రీ ఐ నినాదంతో భారత్ ముందుకెళ్లినప్పుడే సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు. 75వ వజ్రోత్సవాల సందర్భంగా రెండున్నరేళ్ల క్రితం ఢిల్లీలో రాజకీయ పార్టీలతో ప్రధాని నిర్వహించిన సమావేశంలో తాను మాట్లాడుతూ మేకిన్ ఇండియాగా మారాలంటే ‘త్రీ ఐ’ ఇన్నోవేషన్, ఇన్‌ఫ్ర్టాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉబర్, అమెజాన్ వంటి ఆవిష్కరణలను మనం ఎందుకు చేయకూడదనే ఆలోచన నేటి యువతలో రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఎన్నో చారిత్రక, వారసత్వ కట్టడాలున్నాయని, ఆ చారిత్రక సంపదను కాపాడాల్సిన అవసరముందని మంత్రి కేటీఆర్ అన్నారు.
హెరిటేజ్ శాఖ, ఆగాఖాన్ ఫౌండేషన్, కుడా సంయుక్తంగా పునరుద్ధరించిన సెవెన్ టూంబ్స్ సమీపంలోని కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్కులోని ఆరు బావులను మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలను పునరుద్ధరించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అవార్డుల ప్రదానంనాణ్యతలో అత్యంత ప్రతిభ చాటుతున్నందుకు పలు సంస్థలకు రాష్ట్ర స్థాయి అవార్డులను మంత్రులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూహెచ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ అకాడమి కొలాబరేషన్ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు.