పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తెలుగు రీమేక్ 'వినోదయ సీతమ్' ఈరోజు షూటింగ్ షురూ..

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న సినిమాల్లో ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సెట్స్‌లో ఉంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. కొంత పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా.. పవన్ పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం వల్ల తరచూ వాయిదా పడుతోంది. ఇదిలా ఉండగానే.. హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు సుజిత్ డైరెక్షన్‌లో ‘OG’ చిత్రాలను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే పవన్ మరో సినిమా ప్రారంభించబోతున్నట్లు కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అన్నట్లుగానే ఈ రోజు (బుధవారం) హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏ సినిమా అంటారా?

ప్రముఖ నటుడు సముద్రఖని (Samudra Khani) తమిళ్‌లో దర్శకత్వం వహించిన ‘వినోదయ సిత్తం’ (Vinodaya Sitham) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తు్న్నారు పవన్. ఈ సినిమాను కూడా సముద్రఖని డైరెక్ట్ చేస్తుండగా.. పవన్‌తో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించనున్నాడు. కాగా హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో నేటి నుంచే చిత్రీకరణ ప్రారంభమైంది. అయితే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఈ మూవీ ఒరిజినల్‌ స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేయడంతో పాటు డైలాగ్ వెర్షన్‌ రాసినట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో సాయి ధరమ్‌కు జోడీగా కేతిక శర్మ నటిస్తోంది.

ఈ రీమేక్ మూవీ కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల పాటు డేట్లు కేటాయించారు. ఈ టైమ్‌లోనే పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయనున్నారు. కాగా.. ఇందులో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. గతంలో వెంకటేష్‌తో కలిసిన నటించిన ‘గోపాల గోపాల’ చిత్రంలోనూ ఆయన కృష్ణుడి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే వీలైనంత తొందరగా షూటింగ్‌ పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ కూడా ప్రాజెక్ట్‌లో భాగమైనందున ఆయన సొంత బ్యానర్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కూడా లాభాలను షేర్ చేసుకోనుంది. ఈ సంస్థ ఇటీవలే వెంకీ అట్లూరి, ధనుష్ కాంబినేషన్‌లో రూపొందిన ‘సార్’ మూవీతో హిట్ అందుకుంది. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ‘సార్’ మూవీకి కోప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.