నేచురల్‌ స్టార్‌ నానికి తప్పిన ప్రమాదం!

తనదైన నటనా శైలితో ప్రేక్షకులు అతి దగ్గరయ్యాడు నేచురల్‌ స్టార్ నాని. ఓ పక్కింటి కుర్రాడిగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగలేని ముద్ర వేసుకున్నాడు. ఇటీవల అంటే సుందరానికీ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరించిన నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దసరా'. ఈ మధ్య కొంత విరామం తీసుకున్న నాని మళ్లీ దసరా షూటింగ్‌లో పాల్లొన్నాడు. అయితే తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో స్వల్ప అపశృతి చోటుచేసుకున్నట్లు సమాచారం.

దసరా సినిమా కథ బొగ్గు గనుల చుట్టూ తిరుగుతుందని పోస్టర్లు, టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా చిత్రీకరణ గోదావరి ఖనిలో జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌లో భాగంగా బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా సీన్‌ చిత్రీకరిస్తున్న సమయంలో బొగ్గంతా అతడిపై పడినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు నానికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. దీంతో చిత్రీకరణకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. నాని తిరిగి కోలుకున్నాక చిత్రీకరణ మళ్లీ పునఃప్రారంభమైంది. కాగా కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కోసం నాని సుమారు 7 కేజీల బరువు తగ్గినట్లు టాక్‌ వినిపిస్తోంది.