సొంత పొలంలోనే కూలీలుగా మారే దుస్థితి.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టులు, ఎల్‌ఐసీ, రైల్వేలు, ఎయిరిండియా వంటి సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని విమర్శించారు. అమ్మకాల పరంపరతో దేశంలో బేచో ఇండియా కార్యక్రమం అమలమవుతోందని ఆక్షేపించారు. ఆయనకు రైతులపైనా వ్యవసాయంపైనా కనీసం అవగాహన లేదని విమర్శించారు. ఇప్పటికే నల్లచట్టాలు తెచ్చి నాలుక కరుచుకున్న మోడీ.. మరోసారి అదే బాటలో వ్యవసాయం, విద్యుత్‌ రంగాలను ప్రైవేటపరం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. ప్రధాని కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆహార భద్రతాచట్టానికి ప్రధాని తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకుంటోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ప్రైవేటు వ్యక్తులకు ఆ బాధ్యతలను కట్టబెట్టేందుకు చూస్తోందని విమర్శించారు.

విద్యుత్‌ సంస్కరణలు అమల్లోకి వస్తే నష్టపోయేది తెలంగాణ రైతులే. రైతులకు ఉచిత విద్యుత్‌ ఉండదు. సొంత పొలంలోనే కూలీలుగా మారే దుస్థితి వస్తుంది. వ్యసాయాన్ని, విద్యుత్‌ను కార్పోరేట్ల కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. విద్యుత్‌, వ్యవసాయంపై కక్షగట్టారు. వ్యవసాయాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామని ప్రకటించడం దారుణం. ఎలాంటి చర్చలు లేకుండా చట్టాలు గెజిట్‌లు తీసుకొస్తున్నారు. దేశంలోని రైతుల్లో 95శాతం మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. రూపాయి పాతాళానికి పోయింది. నైజీరియాను దాటి భారతదేశం పేదరికం చేరిందని నివేదికలు చెబుతున్నాయి. కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి గల్లీకో విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతిస్తున్నారు. తన మిత్రుడిని అపరకుబేరుడిగా చేసే వరకు ప్రధాని మోదీ నిద్రపోయే పరిస్థితి కనిపించడం లేదు.

– కేటీఆర్, తెలంగాణ మంత్రి

అంతే కాకుండా విద్యుత్ రంగంలో సంస్కరణలతో సబ్సిడీలు ఎత్తేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 26లక్షల పంపు సెట్లు ఉన్నాయన్న కేటీఆర్.. వీటికి విద్యుత్‌ ఇవ్వకపోతే రైతులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. కేంద్రం కుట్రలు కొనసాగితే అత్యధికంగా నష్టపోయేది తెలంగాణే. ప్రైవేటు కంపెనీలు విద్యుత్‌ రంగంలోకి అడుగుపెడితే పెట్రోల్, డీజిల్‌ లెక్క రోజు ధరలు మారతాయని, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఏ పిలుపునిస్తే దానికి సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్.. పార్టీ నేతలు, ప్రజలకు పిలుపునిచ్చారు.