నేడు యాదగిరిగుట్టకు సీఎం

మహాకుంభాభిషేకం చివరిరోజు...
మహోత్సవంలో పాల్గొననున్న కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి రానున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శ్రీపర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి శివాలయంలో జరిగే మహాకుంభాభిషేకం మహోత్సవంలో పాల్గొననున్నారు. ఈనెల 20న మహోత్సవాలు ప్రారంభంకాగా, చివరిరోజైన సోమవారం మహాకుంభాభిషేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. శ్రీరాంపురం (తొగుట) పీఠాఽధిపతి మాధవానంద సరస్వతిస్వామి పర్యవేక్షణలో శ్రీరామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ్ఠ, ప్రతిష్ఠాంగహోమం, ఆఘోరమంత్రహోమం, దిగ్దేతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ, మధ్యాహ్నం 12.30గంటలకు మహాపూర్ణాహుతి, అవబృథం, మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి ఉదయం 10గంటలకు హెలికాప్టర్‌ ద్వారాగుట్టకు చేరుకోనున్నట్టు సమాచారం. శివాలయం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారికంగా ఇంకా షెడ్యూల్‌ విడుదల కాలేదు.

వైభవంగా శతరుద్రాభిషేక పర్వాలుశివాలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక వైదిక పర్వాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఐదోరోజు దర్శన క్యూకాంప్లెక్స్‌లోని చరమూర్తులకు నిత్య పూజాకైంకర్యాలు నిర్వహించిన అర్చకులు... శివాలయ బాహ్య ప్రాకార మండపంలోని యాగశాలలో చతుస్థానార్చనలు, ద్వారతోరణ ధ్వజకుంభారాధనలు, మూలమంత్ర హవన పూజలు చేశారు. శివాలయంలో ప్రతిష్ఠించనున్న దేవతామూర్తుల విగ్రహాలకు మూలమంత్ర పఠనాలతో హోమ పూజలను సంప్రదాయరీతిలో నిర్వహించారు. కాగా, ఆలయ ఖజానాకు ఆదివారం రూ.29,00,477 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.