
కేసీఆర్ సభల వెనుక అంతర్యం ఇదే!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు, తెలుగు వాళ్ళ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి వ్యూహాత్మకంగా వెళుతున్న కేసీఆర్ అందులో భాగంగా ముందు తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలలో పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నారు. సరిహద్దు రాష్ట్రాలలో బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై అభిమానం ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని మరీ టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ నాందేడ్ లో ఫిబ్రవరి 5వ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై కేసీఆర్ ఫోకస్ ఇక ఈ సభ ద్వారా మహారాష్ట్రలో కేసీఆర్ పై అభిమానం చూపించే యువతను పార్టీ వైపు లాక్కొస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో పలువురు కీలక నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. గత కొంతకాలంగా మహారాష్ట్రలోని కొన్ని సరిహద్దు గ్రామాలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు తాము కూడా వాటి నుండి లబ్ది పొందాలని భావిస్తూ గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు వారు తమకు మహారాష్ట్ర వద్దు,తెలంగాణరాష్ట్రం ముద్దు అంటూ తెలంగాణ రాష్ట్రంలోకలపాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణాలో కలపాలని డిమాండ్ చేస్తున్న మహారాష్ట్ర గ్రామాలు మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహరాజ్‌గూడ, నాకే వాడ సహా 14 గ్రామాల గ్రామస్థులు మహారాష్ట్రలో సరిహద్దు ప్రాంతాలలో సమస్యలు ఉధృతం కావడంతో తెలంగాణలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కెసిఆర్ కోసం వారు బైక్ ర్యాలీలు కూడా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సరిహద్దు గ్రామాల ప్రజలకు, వృద్ధులకు వెయ్యి రూపాయల పింఛన్,10 కిలోల రేషన్ బియ్యం తో పాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే వారు తమ గ్రామాలను తెలంగాణలో కలపడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇక ఈ గ్రామాల ప్రజలను టార్గెట్ చేస్తున్న కేసీఆర్ వారందరిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ సభల వ్యూహాల వెనుక మాస్టర్ మైండ్ కెసిఆర్ గత మూడు రోజులుగా ఈ జిల్లాల ఎమ్మెల్యేలు నేతలతో ప్రత్యేకంగా సమావేశమై సభను విజయవంతం చేయడానికి, జరుగుతున్న ఏర్పాట్ల పైన, అనుసరించాల్సిన వ్యూహాల పైన దిశా నిర్దేశం చేశారు. మొత్తంగా చూస్తే సీఎం కేసీఆర్ తెలుగు వాళ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నచోట, తమకు పట్టు దొరుకుతుంది అనుకున్న చోట, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలలో, సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఆకట్టుకునే క్రమంలో సభలను నిర్వహిస్తూ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. మరి కెసిఆర్ ఇతర రాష్ట్రాల్లో పట్టు కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితం ఇస్తాయి అన్నది వేచి చూడాల్సిందే.