ఆ ఎస్టీపీలు పూర్తయితే 100% మురుగు శుద్ధి

 నగరంలో జరుగుతున్న సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణ పనులు వచ్చే వేసవి కాలం నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.టీ.రామారావు అన్నారు. శనివారం నగరంలో పలు చోట్ల జలమండలి నిర్వహిస్తున్న ఎస్టీపీల నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం కొత్తగా తీసుకున్న సేఫ్టీ ప్రొటోకాల్‌ వాహనాలను నానక్‌రాంగూడలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో మురుగునీటి నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి మూడు ప్యాకేజీల్లో 31 ఎస్టీపీల నిర్మాణం చేపడుతోందన్నారు. అన్ని ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే 100 శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్‌ మారబోతుందని మంత్రి పేర్కొన్నారు. మురుగునీటి పారుదల విషయంలో పనులు నిర్వహించే చోట ప్రత్యేక భద్రత వ్యవస్థను జలమండలి అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌తో కలిసి ఫతేనగర్‌లో నిర్మిస్తున్న ఎస్టీపీ నిర్మాణం పనులను పరిశీలించిన ఆయన చుట్టు పక్కల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయా అధికారులకు సూచించారు. ఎస్టీపీల ప్రాంగణాల్లో హెచ్‌ఎండీఏ సహకారంతో గార్డెనింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో భద్రతా చర్యలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి ఆదేశించారు.

సేఫ్టీ ప్రొటోకాల్‌ వ్యవస్థ వివరాలు..
‘పని ప్రదేశంలో భద్రత.. ప్రజల భద్రత’అనే నినాదంతో నగరంలో జలమండలి చేపట్టే పైప్‌లైన్‌ విస్తరణ, సీవరేజ్‌ పనులు, లీకేజీల నివారణ పనులు, మ్యాన్‌ హోల్‌ మరమ్మతులు, ఇలా ప్రతి పని ప్రదేశంలో భద్రతా చర్యలు కచ్చితంగా పాటించేలా కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. సేఫ్టీ ప్రొటోకాల్‌ టీమ్స్‌(ఎస్పీటీ) పేరుతో ఆరు జలమండలి సరిళ్లకు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ఒకో బృందంలో ఒక ఇంజినీర్‌, ఒక కానిస్టేబుల్‌, ఒక హోంగార్డు కమ్‌ డ్రైవర్‌ ఉంటారు. ఈ మొత్తం బృందాలకు చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. ఈ బృందాల కోసం సీఎస్‌ఆర్‌ నిధులతో ఆరు ఎస్పీటీ వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ వాహనాలకు కెమెరా, బృందంలోని ఒక సభ్యుడికి బాడీ కెమెరా ఉంటాయి. వీటితో పాటు జీపీఎస్‌ ట్రాకింగ్‌ చేస్తూ నిరంతరం వీటిని పర్యవేక్షిస్తారు. పని ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగవద్దనే ఆలోచనతోనే ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు.

మూడు ప్యాకేజీల్లో 31 ఎస్టీపీల నిర్మాణం
నగరంలో 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా జలమండలి చేప ట్టిన 31 ఎస్టీపీల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం మూడు ప్యాకేజీల కింద నిత్యం 1257.50 ఎంఎల్‌డీల (మిలియన్‌ లీటర్‌ పర్‌డే) మురుగు నీరు శుద్ధి చేయాలనే లక్ష్యంతో మొత్తం 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ) జలమండలి నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ప్యాకేజీ-1లో అల్వాల్‌, మలాజ్‌ గిరి, కాప్రా, ఉప్పల్‌ సరిల్‌ ప్రాంతాల్లో.. రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. వీటి మొత్తం సామర్థ్యం 402.50 ఎంఎల్‌డీలు. ప్యాకేజీ-2 లో రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌ సరిల్‌ ప్రాతాల్లో రూ.1355.33 కోట్లతో 6 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. ఇకడ 480.50 ఎంఎల్‌డీల మురుగునీటిని శుద్ధి చేస్తారు. ప్యాకేజీ-3లో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి సరిల్‌ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. వీటి మొత్తం సామర్థ్యం 376.5 ఎంఎల్‌డీలుగా ఉంది. ఇలా మొత్తం మూడు ప్యాకేజీల్లో కలిపి సుమారు రూ.3865 కోట్లను ఎస్టీపీల నిర్మాణం కోసమే వెచ్చిస్తున్నారు.

ఫతేనగర్‌ ఎస్టీపీ వివరాలు..
ప్యాకేజ్‌-3లో భాగంగా 11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీ ద్వారా ప్రతి రోజు 133 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి చేస్తారు. బాలానగర్‌, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సూరారం, జగద్గిరిగుట్ట నుంచి వచ్చే మురుగును ఫతేనగర్‌లో నిర్మిస్తున్న ఎస్టీపీలో శుద్ధి చేస్తారు. 2036వ సంవత్సరం వరకు ఇబ్బంది లేకుండా 9.84లక్షల జనాభాకు సరిపడా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో స్వీక్వెన్షియల్‌ బ్యాచ్‌ రియాక్టర్‌ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.

కోకాపేట ఎస్టీపీ వివరాలు..
ప్యాకేజీ-2లో భాగంగా మూసీకి దక్షిణ వైపున మురుగునీటి శుద్ధి కోసం రాజేంద్రనగర్‌ పరిధిలోని కోకాపేటలో రూ.33.67 కోట్ల వ్యయంతో 15 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణం జరుగుతోంది.