
Hyderabad: నగరంలో మునావర్ షోపై సస్పెన్స్.. ఇంకా రాని క్లారిటీ.. బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్..
Telangana: షో ఉంటుందా? ఉండదా? ఇప్పుడు ఇదే విషయం హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. మరికొన్ని గంటల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్(Munawar Faruqui) షో వివాదాస్పదం అవుతోంది. ఈ షోకి పోలీసులు అనుమతి ఇవ్వడంపై రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు..ప్రసుత్తం ఈ షోపై సస్పెన్స్ నెలకొంది.
బీజేపీ నేతల హెచ్చరికల నేపధ్యంలో శిల్పకళా వేదిక(shilpakala vedika) దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మునావర్ ఫరూఖీ షో నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ గందరగోళంపై క్లారిటీ ఇచ్చేందుకు ఇన్‌స్టాలో మధ్యాహ్నం 12గంటలకు లైవ్ ఉంటుందని ప్రకటించాడు మునావర్. ఆ తరువాత టెక్నికల్ ప్రాబ్లం, ఇంటర్నెట్‌కు అంతరాయం అని తెలిపాడు. హిందూ దేవుళ్లపై సెటైర్లు పేల్చే మునావర్ షో అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ, బీజేవైఎం నేతలు హెచ్చరించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కమెడియన్ మునావర్ ఫారూఖీని వెంటపడి కొడతామని ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు.. రాజాసింగ్‌ను ముందస్తు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. ఇటు డీసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు. ఇవాళ ఏదైనా జరుగొచ్చని వార్నింగ్ ఇచ్చారు రాజాసింగ్. అయితే ఇప్పుడు అసలు షో జరుగుతుందా ? లేదా ? అనే ఉత్కంఠ మొదలైంది. శిల్పాకళా వేదిక ప్రాంతంలో అనుమానంగా సంచరించేవారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.