ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ వాతావరణం.. ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ మళ్లింపు..!

ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో వివాదం హైదరాబాద్ నగరంలో హై టెన్షన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా పాతబస్తీలో పరిస్థితి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. పాతబస్తీలో నిరసనలు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (Rapid Action Force) బలగాలు భారీగా మోహరించాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు.. అవసరాన్ని బట్టి ఆంక్షలు విధించాలని పోలీసులు నిర్ణయించారు.


పాతబస్తీ (Old City) నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అనుమతించేందుకు ప్రణాళిక రూపొందించారు ట్రాఫిక్‌ పోలీసులు. రాత్రి 8 గంటలలోపు అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసివేయాలని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో గుంపులుగా తిరిగితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. గస్తీ వాహనాల్లో తిరుగుతూ.. పోలీసులు (Hyderabad Police) అన్ని దుకాణాలకు మూసివేయిస్తున్నారు. అటు.. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు కూడా చేపట్టారు. వాహనదారులు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

ఎంజే మార్కెట్ నుంచి నయాపూల్ వంతెన, ఎంజే వంతెన, పురానాపూల్ వంతెన మీదుగా.. ఓల్డ్ సిటీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను 100 ఫీట్ రోడ్డు, జియాగూడ, రాంసింగ్‌పురా, అత్తాపూర్, ఆరామ్‌ఘర్‌, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట వైపు మళ్లిస్తామని పోలీసులు వెల్లడించారు.

ఎంజే మార్కెట్ నుంచి నయాపూల్ వంతెన, శివాజీ వంతెన మీదుగా.. పాతబస్తీకి వెళ్లే ట్రాఫిక్‌ను రంగమహల్, చాదర్‌ఘాట్, నింబోలియాడ్డ, టూరిస్ట్ జంక్షన్, బర్కత్‌పురా, ఫీవర్ ఆస్పత్రి, విద్యానగర్, తార్నాక వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు వివరించారు.

పురానాపూల్ వంతెన, ఎంజే వంతెన నుంచి పాతబస్తీ, మలక్‌పేట్, ఎల్బీ నగర్ వైపు వెళ్లే మార్గాల్లో సాధారణ ట్రాఫిక్ అనుమతించబోమని స్పష్టం చేశారు. నయాపూల్ వంతెన, శివాజీ వంతెన, చాదర్‌ఘాట్ వంతెన, చాదర్‌ఘాట్ కాజ్‌వే, మూసారాంబాగ్ వంతెన ద్వారా ట్రాఫిక్‌ను ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో అవసరాన్ని బట్టి మళ్లిస్తామని పోలీసులు చెప్పారు.

కోటి, అబిడ్స్‌ వైపు నుంచి చాదర్‌ఘాట్‌ వంతెన, చాదర్‌ఘాట్‌ కాజ్‌ వే, మూసారాంబాగ్‌ వంతెన మీదుగా మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను.. నింబోలియాడ్డ, టూరిస్ట్‌ జంక్షన్‌, బర్కత్‌పురా, ఫీవర్‌ ఆస్పత్రి, విద్యానగర్‌, తార్నాక, చే నంబర్‌, రామంతాపూర్‌ వైపు మళ్లించనున్నట్టు వెల్లడించారు.

పాతబస్తీ నుంచి నయాపూల్ వంతెన, ఎంజే వంతెన, పురానాపూల్ వంతెన మీదుగా.. అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్, లక్డీకాపూల్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తామన్నారు. చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్‌, అత్తాపూర్, మెహదీపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు.. ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.

దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్ నుంచి మూసారాంబాగ్, చాదర్‌ఘాట్, ఎస్‌జే వంతెన మీదుగా.. అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్ వైపు వెళ్లే ట్రాఫిక్ ఉప్పల్, తార్నాక, విద్యానగర్, ఫీవర్ ఆస్పత్రి, బర్కత్‌పురా నుంచి వెళ్లాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. నగరవాసులు దీన్ని గమనించి.. పోలీసులకు సహరించాలని విజ్ఞప్తి చేశారు.