టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సమావేశానికి.. 3 వేలమంది

ఈ నెల 27న జరిగే టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆదివారం ఆయన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరిగే హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు పండుగగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భవించి 21 ఏళ్లు పూరైనందున ప్రతినిధుల మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, పార్టీకి చెందిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జడ్పీ చైర్మన్లు, సహకార బ్యాంక్‌ చైర్మన్లు, జడ్పీటీసీ సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు, గ్రంఽథాలయ చైర్మన్లు, మహిళా కోఆర్డినేటర్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం పార్టీ ఆహ్వానాలు అందినవారే సభకు రావాలని సూచించారు.

సభకు వచ్చే వారికి పాసులు జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్థి, నిర్ణయాలు, జాతీయ రాజకీయాలపై వార్షికోత్సవంలో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో,  3618 చోట్ల పట్టణ  వార్డుల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతోన్న నేపథ్యంలో సోమవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో ఏర్పాట్లపై సమావేశం కానున్నట్లు ఆయన వెల్లడించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే గోపీనాథ్‌, ఎమ్మెల్సీ నవీన్‌ రావు ఉన్నారు. కాగా, మంత్రి కేటీఆర్‌ సోమవారం నాటి ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఈ- కామర్స్‌ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్‌ కమిటీ సమావేశంతో పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్‌ టెక్‌ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అందుకే ఖమ్మం పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించారు. ఒకటి, రెండు రోజుల్లో కేటీఆర్‌ ఖమ్మం పర్యటన ఖరారవుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.