నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు మంగళవారం తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే.. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులను గంగలో కలిపేంత బలహీనంగా తెలంగాణ లేదని ఢిల్లీలోని నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోళ్లు, రైతుకు మద్దతు ధర, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. అనంతరం ప్రభుత్వ కార్యాచరణను ప్రకటించనున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినా.. ఆ తర్వాత వాటిని ఏం చేయాలన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
