దేశంలో అత్యంత సేఫ్ సిటీగా మూడోస్థానంలో హైదరాబాద్

దేశంలో అత్యంత సేఫ్ సిటీల జాబితాలో హైదరాబాద్ మూడవ స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం కోల్‌కతా, పూణే తర్వాత దేశంలోనే అత్యంత సురక్షితమైన మెట్రో నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరుస కార్యక్రమాల కారణంగా హైదరాబాద్ సురక్షితమైన నగరంగా కొనసాగుతోంది. దేశంలో అత్యంత సేఫ్ సిటీలలో మూడో స్థానంలో హైదరాబాద్ గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందే, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే శాంతిభద్రతలు క్షీణిస్తాయని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మేధావులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మావోయిస్టులు తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేస్తారని కూడా కొందరు చెప్పారు. అయితే వారి సందేహాలను నివృత్తి చేస్తూ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గత ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని నివేదిక ఆధారంగా వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించడంలో పోలీసు శాఖ విజయం సాధించింది. ఈ ఫలితంగానే ప్రస్తుతం దేశంలో అత్యంత సేఫ్ సిటీలలో హైదరాబాద్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.