నంబర్‌ ప్లేట్‌ లేకుంటే జైలుకే..!

నంబర్‌ ట్యాంపరింగ్‌పై సిటీ పోలీస్‌ సీరియస్‌
మూడు రోజుల్లో 100 కేసులు నమోదు
వాహన యజమానిదే బాధ్యత

వాహనాల నంబర్‌ ప్లేట్లు మార్చడం, నంబర్‌ ప్లేట్‌ లేకుండా, నంబర్‌ కన్పించకుండా చేయడం, రిజిస్ట్రేషన్‌ గడువు పూర్తయినా తాత్కాలిక నంబర్‌తోనే వాహనాలపై తిరుగుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. నంబర్‌ ప్లేట్‌ లేకుండా, ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్‌ చేసే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ప్రారంభమైన స్పెషల్‌ డ్రైవ్‌లో 100కుపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వాహనం ఎవరి పేరుపై ఉంటుందో వారే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఉల్లంఘనలపై పోలీసుల ఆగ్రహం
నేరాలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్‌ నిబంధనలతో లింక్‌ అయి ఉన్న ఈ ఉల్లంఘనను పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. కొందరు ట్రాఫిక్‌ చలాన్లు తప్పించుకోవడానికి నంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరుగుతుండగా.. మరికొందరు మాత్రం నేరాలు చేసేందుకు వాహనాల నంబర్‌ ప్లేట్‌ తీసేయడం, ట్యాంపరింగ్‌ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వాహనం నంబర్‌ ప్లేట్‌ సక్రమంగా ఉన్న వారు నిబంధనలు పాటిస్తారు, నంబర్‌ప్లేట్‌ సరిగ్గా లేని వారు తమనెవరూ పట్టుకోరనే ధీమాతో ఇష్టానుసారంగా వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారకులువుతున్నారని పోలీసుల విచారణలో తేలింది.

గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి
వాహనానికి నంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరగడం, ఒక వాహనం నంబర్‌ను మరో వాహనానికి వేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. షోరూం నుంచి వాహనం కొనుగోలు చేసి తాత్కాలిక నంబర్‌తోనే బయటకు తీసుకొస్తారు. నెల రోజుల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ తరువాత జరిమానాతో రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని చాలా మంది తాత్కాలిక నంబర్‌ ప్లేట్‌తోనే తిరుగుతున్నారు. మరికొందరు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా నంబర్‌ ప్లేట్లు వాహనానికి వేసుకోకుండా తిరుగుతున్నారు. ఇలాంటి వారు పట్టుబడితే కేసులు నమోదు చేయనున్నారు. వీరిపై చార్జీషీట్‌ వేసి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కోర్టుకు హాజరై కోర్టు తీర్పు మేరకు వాహనదారుడు నడుచుకోవాలి. మిగతా ఉల్లంఘనలు కూడా అలాగే ఉంటాయి.

నిబంధనలు పాటించండి

నెంబర్‌ ప్లేట్ల విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాం. నంబర్‌ ప్లేట్‌ లేకుం డా కొందరు నేరాలకు పాల్పడే అవకాశాలున్నాయి. ప్రతి రోజు ఇలాంటి ఉల్లంఘనలపై ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి పెడుతున్నారు. వాహన యజమానులు జాగ్రత్తగా ఉండాలి. – రంగనాథ్‌, ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ