
జాతీయ రాజకీయాల దిశలో KCR మరో ముందడుగు..
సీఎం కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా శుక్రవారం భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో గుజరాత్ మాజీ సీఎం వాఘేలా కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
జాతీయ రాజకీయాల్లోకి (National Politics)వెళ్లడానికి సీఎం కేసీఆర్ (CM KCR) కొన్ని నెలల నుంచి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకుంటున్నారు కేసీఆర్. కేంద్రంలోకి బీజేపీ రహిత ప్రభుత్వం రావాలంటూ బీజేపీ ముక్త భారత్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇదే నినాదంతో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్‌కు మద్దతు పలుకుతున్నారు. ఓవైపు కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నాయకులను హైదరాబాద్‌కు రమ్మని ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు కేసీఆర్ పక్కా ప్లాన్ వేస్తున్నారు.
గుజరాత్ మాజీ సీఎంతో కీలక సమావేశం..
తాజాగా సీఎం కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా ( former Gujarat CM Shankar singh Vaghela) శుక్రవారం హైదరాబాద్లో (Hyderabad) భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో గుజరాత్ మాజీ సీఎం వాఘేలా కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు నేతలు దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చాలా సేపటి వరకు చర్చించారు. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలు కలిసి పెను మార్పు తీసుకురావాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ వైఫల్యాలు, మతతత్వ రాజకీయాలు అనే అంశాలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే విషయం గురించి ఇరువురు మాట్లాడారు.
గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా ఇటీవలనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ సింగ్ వాఘేలా తన పార్టీ తరపున అభ్యర్ధులను బరిలోకి దింపనున్నారు. రాష్ట్రంలోని 182 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దింపుతామని శంకర్ సింగ్ వాఘేలా ప్రకటించారు.
కొత్త పార్టీలో రైతు పేరు వచ్చేలా మార్పులు..
కేసీఆర్ జాతీయ పార్టీ పేరుపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS).. ఇకపై భారత రాష్ట్ర సమితి (BRS)గా మారుతుందని అప్పట్లో చర్చ జరిగింది. కానీ కొత్త పార్టీలో రైతు పేరు వచ్చేలా మార్పులు చేశారని ప్రచారం జరుగుతోంది. పార్టీ జెండా సైతం వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా ఆకుపచ్చ రంగులో ఉండవచ్చని సమాచారం. ఎన్నికల గుర్తు విషయంలోనూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రైతునాగలి గుర్తుతో పార్టీని లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఐతే కొందరు టీఆర్ఎస్ నేతలు మాత్రం.. జాతీయ పార్టీ జెండా కూడా గులాబీ రంగులోనే ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. రైతులతో పాటు బడుగు, బలహీనవర్గాలు సంక్షేమాన్ని ప్రతిబింబించేలా.. తెలంగాణ పథకాలను జెండాలో పొందుపరచచ్చని తెలుస్తోంది. కానీ సీఎం కేసీఆర్ గానీ, ఇతర టీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీని ప్రకటిస్తారని మాత్రమే.. లీకులిచ్చారు.