ఎవరి ప్రయోజనాల కోసం పెట్రో ధరల పెంపు.. లూటీ చేస్తున్నారు కదయ్యా మోదీ : KTR
కేంద్రంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్రానికి లేఖ రాశారు. అడ్డగోలుగా పెట్రో ధరలను పెంచుతోందని దుయ్యబట్టారు. సబ్ కా సాథ్ .. సబ్ కా వికాస్ అని గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ గా అయిందని విమర్శలు గుప్పించారు.దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రో రేట్లను పెంచుతోందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థ విధానాలతో ప్రజలు అల్లాడుతున్నారని దుయ్యబట్టారు.
నిరంతరం పెట్రోల్ ధరల పెంపు ప్రతి రోజూ పెట్రో ధరలను పెంచుతూ .. ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే కుట్రను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలతో సంబంధంలేకుండా అడ్డూ అదుపు లేకుండా దేశంలో పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను పెంచుతోందని ఆరోపణలు గుప్పించారు. చమురు ధర పెరుగుదలతో సామాన్యులపై పెనుభారం పడిందన్నారు. ఒక్కో కుటుంబం నుంచి రూ. లక్ష పెట్రో పన్నును కేంద్రం ప్రభుత్వం దోచుకుంటుందని పేర్కొన్నారు.
మోడీ మొసలి కన్నీరు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోసి, మొసలి కన్నీరు కార్చిన మోదీ.. అధికారం చేపట్టాక ప్రజల్ని లెక్క చేయడంలేదని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు. పాలన చేతగాని తనంతో ప్రజల్ని పీడించుకు తింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెట్రో ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి చేరాయన్నారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయడం చేతకాని మోదీ.. దానికి కుంటి సాకులు చెబుతోందని మండిపడ్డారు.
ప్రజలను పీడించుకోవడమే పరిపాలనా..? పన్నులు పెంచి ప్రజలను పీడించుకోవడమే పరిపాలన అన్న భ్రమలో ప్రదాని మోదీ ఉన్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. అచ్చేదిన్ కాదు.. అందర్నీ ముంచే దిన్ అని ఎద్దేశా చేశారు. చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం రోజుకో కుంటి సాకు చెబుతోంది. 2014లో ముడి చమురు ధర ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉందన్నారు.
రేటు రెట్టింపయ్యిందంటూ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. ఏ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారో బీజేపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మన పొరుగు దేశాల్లో కూడా ఈ విధంగా పెట్రోల్ ధరలు లేవని గుర్తు చేశారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కూడా పెట్రోల్ ధరలు తక్కువేనని చెప్పారు. దేశంలో ఇలాగే పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతే మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.
