
BWF World Badmintonship 2022: చరిత్ర సృష్టించిన ధ్రువ్- అర్జున్ జోడీ..
భారత షట్లర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ అద్బుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. టోక్యో వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్-2022లో భాగంగా ఈ ద్వయం గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సింగపూర్ జోడీతో తలపడింది.
ఈ మ్యాచ్‌లో హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ జంటను ఓడించింది. మొదటి గేమ్‌లో (18-21) కాస్త వెనుకబడినా.. వరుసగా రెండు గేమ్‌లలో 21-15, 21-16తో సత్తా చాటి విజయం అందుకుంది. తద్వారా ధ్రువ్ కపిల- ఎం. ఆర్ అర్జున్ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
ఇక అంతకు ముందు రెండో రౌండ్‌లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్(అన్‌సీడెడ్) ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కిమ్ ఆస్‌ట్రప్–ఆండెర్స్ రస్‌ముసెన్ (డెన్మార్క్)పై గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 21–17, 21–16తో విజయం నమోదు చేసి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. క్వార్టర్ ఫైనల్లో ధ్రువ్- అర్జున్.. మూడో సీడ్ ఇండోనేషియా ద్వయం మహ్మద్ అహ్సాన్, హెండ్రా సెటీవాన్‌తో తలపడనున్నారు.