
తెలంగాణాపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. నేరుగా అమిత్‌షాకే రహస్య నివేదికలు..
కేంద్రంలోని బిజెపి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? 2024 లోక్ సభ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ దృష్టి సారించిందా? తెలంగాణ పై ఫోకస్ చేస్తున్న కేంద్రం క్షేత్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కమల వికాసం పై దృష్టిసారించిందా? మునుగోడు విషయంలో ఇంత ఫోకస్ వెనుక కారణం ఉందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
తెలంగాణాపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. కేంద్రంలోని బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోని భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే వచ్చిన మునుగోడు ఉప ఎన్నికను కీలకంగా భావిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికతో పాటుగా, తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, రాష్ట్ర పార్టీ చేస్తున్న కృషి, పార్టీని గ్రామస్థాయి లోకి తీసుకువెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు, వచ్చే ఎన్నికలకు ప్రజలను సిద్ధం చేస్తూ చేస్తున్న సన్నద్ధ కార్యక్రమాలపై బిజెపి జాతీయ నాయకత్వం దృష్టిసారించింది.
క్షేత్రస్థాయిలో రహస్య నివేదికలు తెప్పించుకుంటున్న అమిత్ షా, జేపీ నడ్డాలు
పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి దూకుడుగా ముందుకు వెళుతుందని, వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టడం తథ్యం అన్నరీతిలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా, బిజెపి అధినాయకత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్ లో క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుంటూ భవిష్యత్ కార్యాచరణకు ప్లాన్ చేస్తుంది. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు నేరుగా నివేదికలు పంపేలా ఎన్నికల ప్రొఫెషనల్స్ బృందం అసోసియేషన్ అఫ్ బిలియన్ మైండ్స్ గత ఏడాది కాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తుంది.