గుడ్ న్యూస్.. తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్

కార్పొరేట్ తరహాలో ప్రభుత్వాస్పత్రుల్లో కూడా సకల సౌకర్యాలు కల్పిస్తామని.. వైద్యారోగ్య శాఖలో 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. పీహెచ్‌సీల్లో వెయ్యి మంది డాక్టర్ల భర్తీకి రాబోయే పది రోజుల్లో ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలిపారు. 140 మంది మిడ్ వైఫరీలు త్వరలో అందుబాటులోకి వస్తారని ఆయన పేర్కొన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం హరీశ్‌రావు ఈ వివరాలు వెల్లడించారు.

ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్‌కు త్రీ టైర్ సిస్టం ఏర్పాటు చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఇలాంటి ట్రైనింగ్ పెట్టాలని అధికారులకు హరీశ్‌రావు సూచించారు. రెండ్రోజుల పాటు ఈ ట్రైనింగ్ క్లాస్‌లు ఉంటాయని.. ఎవరూ మిస్సవ్వొద్దని చెప్పారు. ఆపరేషన్ థియేటర్స్, డయాలసిస్ వార్డ్స్, లేబర్ రూమ్‌లలో ఇన్ఫెక్షన్ ఉంటుందని, ఇన్ఫెక్షన్ కంట్రోల్‌కి వెనకాడొద్దని సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఏడు శాతం ఉంటే.. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో పది శాతం ఉందని చెప్పారు.


ప్రతి ఆస్పత్రిలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేయాలని.. ప్రతి సోమవారం ఆ కమిటీ రివ్యూ చేసి వివరాలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆస్పత్రుల్లో రూ.30 కోట్లతో మార్చురీల ఆధునికీకరణ చేపట్టామన్నారు. 56 హై ఎండ్ అల్ట్రా సౌండ్ మిషన్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయని.. ఇకపై గర్భిణులు స్కాన్ కోసం బయటకు వెళ్లాల్సిన పని ఉండదంటూ హరీశ్‌రావు తెలిపారు.