
తెలంగాణలో రూ.500 కోట్లతో భారీ పరిశ్రమ.. ముందుకొచ్చిన మరో ప్రముఖ సంస్థ
తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. తొలిరోజు రూ. 600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు రాగా, తాజాగా మరో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ సిద్ధమైంది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. బెల్జియం దేశానికి చెందిన అలియాక్సిస్ సంస్థ రూ.500 కోట్లతో పైపులు, ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తుల భారీ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది. దీని ద్వారా 500 మందికి ఉపాధి లభించనుంది. ఈ మేరకు దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ క్రమంలోనే పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, అలియాక్సిస్ కంపెనీ సీఈవో కోయిన్ స్టికర్ దీనిపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్టికర్ మాట్లాడుతూ.. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల కోసం అంతర్జాతీయ స్థాయి ప్లాస్టిక్ ఉత్పత్తులను తెలంగాణలో తయారు చేస్తామన్నారు. భారత్‌లో అతిపెద్ద పైపుల మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని తాము భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలోని అత్యుత్తమ విధానాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఆశీర్వాద్’ పేరుతో పైపులను ఉత్పత్తి చేయనున్న ఈ సంస్థకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పుకొచ్చారు. కాగా, తొలిరోజు రూ. 600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.