‘ఆర్‌ఆర్ఆర్’ మూవీకి గాను తాజాగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌ అవార్డు

‘ఆర్ఆర్ఆర్’ మూవీ హవా ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. అంతర్జాతీయ వేదికపై వరుస అవార్డులతో దూసుకుపోతోంది. ఇటీవలే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ నుంచి ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు హలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్(HCA) నుంచి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్‌కు స్పాట్ లైట్ విన్నర్ అవార్డ్ కూడా దక్కింది. ఇదిలా ఉంటే.. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి(Keeravani) బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డ్ గెలుచుకున్నారు.
 
విజువల్ వండర్‌గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’(RRR) ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. భారీ వ్యయంతో తెలుగు ఇండస్ట్రీలో టాప్ స్టార్లుగా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ (Ram Charan)తో మల్టీస్టారర్‌గా రూపొందిన చిత్రం ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ ఫీలింగ్ ఇచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ కథను భారీ కాన్వాస్‌పై తీర్చిదిద్దిన విధానం వరల్డ్‌వైడ్‌గా మెప్పు పొందుతోంది. దీంతో ఈసారి ఆస్కార్ నామినేషన్స్‌‌లో ‘ఆర్ఆర్ఆర్’ ఉండటం ఖాయమని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

ఈ క్రమంలోనే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ నుంచి రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకోగా.. మూవీ టీమ్ సైతం HCA నుంచి స్పాట్ లైట్ విన్నర్ అవార్డ్ కైవసం చేసుకుని సత్తా చాటింది. ఇదిలా ఉంటే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అవార్డ్ చేరింది. ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన కీరవాణి తాజాగా ‘బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్’ నుంచి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డ్ గెలుచుకున్నారు. ఈ విషయాన్ని బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. కాగా ఈ కేటగిరీలో ఉమెన్ టాల్‌కింగ్ మూవీకి మ్యూజిక్ అందించిన హిల్డుర్ రన్నరప్‌గా నిలిచారు.

ఇక కీరవాణి విషయానికొస్తే.. టాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాలుగా మ్యూజిక్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. రాజమౌళికి సోదరుడు కూడా కావడంతో ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాకు కీరవాణే సంగీతం అందిస్తూ వస్తున్నారు. గతంలో రాజమౌళి తీసిన ‘ఛత్రపతి, ఈగ’ చిత్రాల మ్యూజిక్‌కు ఆయన నంది అవార్డు గెలుచుకున్నారు. అలాగే ‘మగధీర, బాహుబలి’ చిత్రాలకు ఫిలిం ఫేర్ గెలుచుకున్నారు. ఈ చిత్రాల తర్వాత రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఆర్‌ఆర్ఆర్’ మూవీకి గాను తాజాగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌ అవార్డు అందుకోవడం విశేషం.

1989లో ‘మనుసు మమత’ చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించిన కీరవాణి.. కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 1998లో నాగార్జున, రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో తెరకెక్కిన భక్తిరస చిత్రం ‘అన్నమయ్య’కు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక హిందీలోనూ పలు చిత్రాలకు మ్యూజిక్ చేసిన కీరవాణి.. అక్కడ ఎంఎం క్రీమ్‌గా పాపులర్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేయనున్నారు. ఇక సంగీత దర్శకుడిగానే కాక గీత రచయితగా కూడా కీరవాణి సత్తా చాటారు. ఇప్పటికే చాలా సినిమాల్లో పాటలు రాసిన ఆయనకు బాహుబలి చిత్రంలోని ఓ పాటకు గాను ఉత్తమ గేయ రచయితగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం దక్కింది.