Ambedkar Jayanti 2022: అంబేడ్కర్‌కు ఘన నివాళి

పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం అమీర్‌పేట గ్రీన్‌పార్క్‌ మ్యారీగోల్ట్‌ హోటల్‌లో నిర్వహించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలకు మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఉత్తమ పారిశ్రామికవేత్తలకు కేటీఆర్‌ అవార్డులను ప్రదానం చేశారు.

అంబేడ్కర్‌ దేశానికే గర్వకారణం: గవర్నర్‌

దేశం పూర్వవైభవం సాధించేందుకు రాజ్యాంగ ఆదర్శాలు, ఆదేశాలను అనుసరిస్తూ భారత రాజ్యాంగానికి లోబడి ఏర్పడిన చట్టబద్ధ కార్యాలయాలు, సంస్థలను గౌరవించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గురువారం భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా గవర్నర్‌ ఆయనకు నివాళులర్పించారు.

భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేడ్కర్‌ దేశానికే గర్వకారణమని, చురుకైన సంఘ సంస్కర్తగా, ప్రముఖ న్యాయవాదిగా చిరస్మరణీయుడని గవర్నర్‌ కొనియాడారు. అణచివేతపై మానవత్వం సాధించిన విజయానికి అంబేడ్కర్‌ అసలైన ఉదాహరణ అని, సమాజంలో అట్టడుగు వర్గాలు, పేదలతో పాటు ప్రతీఒక్కరికీ రాజ్యాంగ హక్కులు దక్కేలా అంబేడ్కర్‌ ఎనలేని కృషి చేశారని గవర్నర్‌ కీర్తించారు.  

అంబేడ్కర్‌కు సీఎం నివాళి  

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 131వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నివాళులర్పించారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. దళిత బంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి రూ.10 లక్షల మొత్తాన్ని నూటికి నూరు శాతం రాయితీ కింద అందిస్తోందని తెలిపారు.