నవతరంపైనే గురి!

మూడోసారి అధికారమే మా లక్ష్యం
సొంత బలం లేకుంటే మమ్మల్ని ఎవరూ గెలిపించలేరు
అది ప్రశాంత్‌ కిశోర్‌ అయినా.. మరెవరైనా అంతే
ఆయన కాదు.. ఐప్యాక్‌ సంస్థ మా పార్టీకి పనిచేస్తుంది
నరేంద్ర మోదీ, అమిత్‌ షాలను వదిలిపెట్టేది లేదు
బీజేపీతో వ్యక్తిగత పంచాయితీ లేదు.. కాంగ్రెస్‌ చచ్చిన పాము
చంద్రబాబుతో మాదిరిగానే జగన్‌తో సత్సంబంధాలు
మా ఓట్లు చీల్చేందుకు షర్మిల, ప్రవీణ్‌కుమార్‌, కేఏ పాల్‌ యత్నం
వారందరి టార్గెట్‌ కేసీఆరే.. ప్రధాని మోదీని ఒక్కమాటా అనరు
రాష్ట్రంలో మా ప్రధాన ప్రత్యర్థులు కేఏ పాల్‌, మజ్లిస్‌
దేశానికి గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ కావాలా? 
లేక గోల్డెన్‌ తెలంగాణ మోడలా? ఏది సరైనదో చర్చ జరగాలి


ప్రత్యేక ఇంటర్వ్యూలో 

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌
రాష్ట్రంలో నవతరమే తమ టార్గెట్‌ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన సబ్బండ వర్గాలకు కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ అంటే ఏమిటో తెలుసు. అప్పుడు 20 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగినవారికి, ఇప్పుడు 18 ఏళ్లకు చేరుకున్నవారికి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ గురించి అంతగా తెలియదు. వాళ్లకు మా పార్టీ సందేశం చేరాల్సి ఉంది. సమాచారం కోసం వారంతా సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నారు. ఈ తరానికి చేరువ కావాలంటే, ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) లాంటి వ్యూహకర్తలు అవసరం’’ అని చెప్పారు. టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినం సందర్భంగా ఈ నెల 27న ప్లీనరీ నిర్వహిస్తున్న సందర్భంగా కేటీఆర్‌ ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకూ అన్ని అంశాలపై టీఆర్‌ఎస్‌ వైఖరిని స్పష్టం చేశారు. ‘తెలంగాణకు అన్యాయం చేస్తూ, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న మోదీ, అమిత్‌ షాలను వదిలిపెట్టబోమ’ని చెప్పారు. బీజేపీ నేతలు తమను ఇటుకతో కొడితే, తాము వారిని రాళ్లతో కొట్టడానికి సిద్ధమని అన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, వివాదాల పైనా స్పందించారు. సొంత బలం లేకుంటే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎవరూ గెలిపించలేరని నిర్మొహమాటంగా చెప్పారు. ఆ ఎవరు అనేది పీకే కూడా కావచ్చన్నారు. 

పార్టీ కార్యక్రమాల నుంచి.. ప్రభుత్వ పథకాలవరకు.. రాష్ట్ర పరిణామాల నుంచి జాతీయ రాజకీయాల దాకా..ప్రత్యర్థుల విమర్శల నుంచి.. ప్రతి విమర్శల దాకావ్యూహకర్త నియామకం నుంచి.. వ్యూహాల దాకాఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సవివరంగా మాట్లాడారు.
టీఆర్‌ఎస్‌ ఏర్పాటై 21 ఏళ్లు పూర్తవుతున్నాయి. 

మీ భవిష్యత్‌ లక్ష్యం ఏమిటి?ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ నాయకత్వంలో అధికారంలోకి రావాలి. ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా సాగాలి. దేశంలో తెలంగాణ ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా ఉద్భవించాలి.

ఈ 8 ఏళ్లలో ప్రజలకు మీరు అనుకున్నవన్నీ చేసినట్టేనా? ఇంకా చేయాల్సివి ఉన్నాయా?తెలంగాణ సుసంపన్న రాష్ట్రంగా ఎదుగుతున్నప్పటికీ, ఇంకా చేయాల్సినవి, జరగాల్సినవి చాలాఉన్నాయి. గృహ నిర్మాణం విస్తరించాలి. పథకాలు, మాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు తెలిజేయాల్సిన అవసరం ఉంది.

మీది ప్రాంతీయ పార్టీ.. కానీ, జాతీయ రాజకీయాల్లో దూకుడు ఎందుకు?ప్రాంతీయ పార్టీ జాతీయ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించకూడదని, కీలక పాత్ర పోషించవద్దని ఎక్కడా లేదు. నన్నడిగితే, జాతీయ పార్టీలుగా చెప్పుకొనే కాంగ్రెస్‌, బీజేపీ.. ఈ రోజు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే. బీజేపీకి దక్షిణాదిలో కర్ణాటకలో తప్ప బలమెక్కడుంది? ఒకరకంగా అది ఉత్తర భారత పార్టీయే. కాంగ్రెస్‌ గెలిచిన లోక్‌సభ సీట్లు 53 మాత్రమే. కేసీఆర్‌ ఒక రాష్ట్ర సీఎంగా జాతీయ స్థాయిలో బలమైన ముద్ర వేస్తున్నారు. రైతు బంధు, మిషన్‌ భగీరథ కేంద్రానికి ప్రేరణగా నిలిచాయి. తెలంగాణ దేశానికి అజెండాను నిర్దేశిస్తోంది. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ దూకుడుకు అర్థం ఉంది.

కేసీఆర్‌ 2016 నుంచి ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటున్నా అడుగు పడలేదు. ఇకపై బీజేపీయేతర ఫ్రంట్‌లో చేరతారా? కాంగ్రెసేతర ఫ్రంట్‌లో చేరతారా?అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. కానీ, ఒకటి మాత్రం పక్కా. మోదీ ప్రధాని కావడానికి చూపించిన గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. అందుకే గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడలా? గోల్డెన్‌ తెలంగాణ మోడలా? దేశానికి ఏది కరెక్టు అన్నది చర్చ జరగాలి. ప్రత్యామ్నాయ రాజకీయానికి, అభివృద్ధికి అవకాశం ఉంది అనే దిశా నిర్దేశం జరగాలి. అయితే, అది ఏ రూపంలో జరుగుతుంది ? ఏం జరుగుతుంది? అనేది కాలమే చెబుతుంది. 

మీ హడావుడి చూస్తే, మళ్లీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు తప్పవనే చర్చ జనంలో ఉంది. మీరేమంటారు?తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కచ్చితంగా 2023లోనే జరుగుతాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు టీఆర్‌ఎస్‌ మైండ్‌ గేమ్‌ ఆడుతోందన్న విమర్శలపై సమాధానం?
ప్రస్తుతం మాకు ఫలానా వర్గం వ్యతిరేకమని గుర్తించి నిర్దిష్టంగా ఓట్లు చీల్చే అవసరంగానీ, అటువంటి వర్గం ఉందని గానీ నేననుకోను. ఇది బీజేపీ మిత్రుల కుట్ర అని నేను భావిస్తా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అనే ఆయన పార్టీ పెట్టిండు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఆయన గురుకులాలను బ్రహ్మాండంగా నడిపించారు. ఇప్పుడు తెల్లారిలేస్తే కేసీఆర్‌ను తిడుతున్నారు. మోదీని మాత్రం పల్లెత్తు మాట అనరు. ఎవరు ఎవరికి ఏజెంటుగా పనిచేస్తున్నరో ప్రజలు గమనించాలి. షర్మిల.. ఆమె అన్న (ఏపీ సీఎం జగన్‌) మీద అలిగి తెలంగాణలో పార్టీ పెట్టుడేంది? ఆమెకు, తెలంగాణకు ఏమిటి సంబంధం? అంటే, ప్రజలు పిచ్చోళ్లనుకుంటున్నారా? షర్మిల తండ్రి వైఎస్‌ తెలంగాణకు ఎలా అడ్డుపడ్డారనేది మర్చిపోయారని అనుకుంటున్నారా? ప్రవీణ్‌, షర్మిల, కేఏపాల్‌.. ఎవరూ మోదీని ఒక్కమాట అనరు. కేసీఆరే వారి లక్ష్యం. ఎవరి ఓట్లను చీల్చాలని వాళ్లు అనుకుంటున్నారు? రాష్ట్రంలో మైనారిటీలు, దళితులు, క్రైస్తవులు బీజేపీకి ఓట్లు వేయరు. అవి మా ఓట్లు. ప్రవీణ్‌, షర్మిల, పాల్‌ వాటిని చీల్చే యత్నం చేస్తున్నారు. అది ఎవరికి లాభమో తెలియట్లేదా?

రాష్ట్రంలో మీ ప్రధాన ప్రత్యర్థి స్థానం ఎవరికి ఇస్తారు ?కచ్చితంగా కేఏ పాల్‌, ఎంఐఎం  టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌పై కంటే ఎమ్మెల్యేల పైనే ఎక్కువ వ్యతిరేకత ఉందనే అభిప్రాయాలపై మీ స్పందన ఏమిటి?ఒక ప్రభుత్వం పది, పదిహేనేళ్లు కొనసాగిన తర్వాత వ్యతిరేకత సహజం. మోదీ ప్రభుత్వంపైనా ఉంటుంది. రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలపై వ్యతిరేకత లేదా? కానీ, మొత్తమ్మీద మాత్రం మళ్లీ కేసీఆర్‌ సీఎం అనే నినాదం ఉంటుంది. టీఆర్‌ఎస్‌ ఉంటేనే తెలంగాణ గొంతు వినిపిస్తుందని, మన ప్రయోజనాలు కాపాడుతుందనే విశ్వాసం ప్రజలకు ఉంది.

2023లో కేటీఆర్‌ను సీఎంగా చూడొచ్చా?2023లో గెలిచినా సీఎం సీట్లో కేసీఆరే ఉంటారు. మళ్లీ సిరిసిల్ల ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే, ఆయన నాయకత్వంలో కొనసాగుతా. కేసీఆర్‌ కేబినెట్‌లోకి తీసుకుంటే మంత్రిగా ఉంటా. లేకుంటే పార్టీకి పనిచేస్తా. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ గురించి.. ఆ ఎన్నికలు ప్రకటించాక మాట్లాడదాం.. ఇప్పుడెందుకు?

ఏపీ సీఎం జగన్‌తో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి?చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి మాదిరిగానే ఇప్పుడు జగన్‌రెడ్డితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం.
తెలంగాణ వస్తే చీకటవుతుందన్నారు. ఇప్పుడు ఏపీలోనే పవర్‌ హాలిడే ప్రకటించారు. కారణాలేంటి?సమర్థ నాయకత్వం, దృఢ సంకల్పం, ముందుచూపు.. వీటన్నింటికి మించి తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్న నిబద్ధత మా సీఎం కేసీఆర్‌కు ఉన్నాయి. అవతల ఏం జరుగుతుందన్న దానిపై నేను మాట్లాడను. మా పోటీ ఏపీతో కాదు. కర్ణాటకతోనూ కాదు. పెట్టుబడుల ఆకర్షణలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పోటీ పడుతోంది.


తరచూ ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల గురించి ప్రస్తావిస్తున్నారు. సంకేతాలు ఏమైనా ఉన్నాయా? 
సంకేతం ఏమీ లేదు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ధోరణి మాకు తెలుసు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. కేంద్ర సర్కారు దృష్టిలో డబుల్‌ ఇంజన్‌ అంటే మోదీ, ఈడీ. అయితే జుమ్లా.. లేకపోతే హమ్లా. వారికి కేసీఆర్‌ కొరకరాని కొయ్యలా ఉన్నారు. ఆయన్ను, ఆయన పార్టీని ఇబ్బంది పెడతారని తెలుసు కాబట్టే అలా అంటున్నాం. కేసీఆర్‌ను జైల్లో పెడతాం అని వాళ్లే (బీజేపీ నేతలు) సంకేతాలిస్తున్నారు. అందుకే వాళ్ల నీతి ఇదీ అని ప్రజలకు చెబుతున్నాం. ఇక కేసీఆర్‌ అవినీతి చేశారు అంటున్నారు. బండి సంజయ్‌ ఫలానా చోట హత్య చేశాడు, సీరియల్‌ కిల్లర్‌ అని నేను అంటాను. శవం చూపెట్టను, ఆధారం చూపెట్టను. జైలుకు పంపుతారా? రేవంత్‌రెడ్డి.. విజయ్‌ మాల్యా కంటే పెద్ద బ్యాంకు కుంభకోణం చేశాడు అని ఆరోపిస్తా. ఆయన్ను జైలుకు పంపిస్తారా?  కేసీఆర్‌ను జైలుకు దేనికి పంపుతారు? దేశానికే ఆదర్శమైన పథకాలు తెచ్చినందుకా? రాజకీయ ప్రత్యర్థులపైకి ఈడీ, సీబీఐ, ఐబీ వంటి సంస్థలను వేట కుక్కల్లా వదలడానికే కేంద్రంలో బీజేపీ సర్కారు ఉందా? సుజనా చౌదరి, సీఎం రమేష్‌ టీడీపీలో ఉంటే కేసులుంటాయి. బీజేపీలో చేరితో మాయమవుతాయి. గంగలో మునిగితే పాపాలు మాయమైనట్టు బీజేపీలో చేరితే పాపాత్ములు పుణ్యాత్ములు అవుతారా? మోదీ గాడ్సే భక్తుడు అని ఓ ఎమ్మెల్యే ట్వీట్‌ చేస్తే జైల్లో పెడతారా? మోదీ గాడ్సే భక్తుడు కాదా? గాంధీని చంపిన గాడ్సే స్వతంత్ర భారతంలో మొదటి టెర్రరిస్టు కాదా? అతడిని ఆరాధించే బీజేపీని నేను కూడా అంటా.. మోదీ గాంధీ సూక్తులు చెబుతారు. గాడ్సే పనులు చేస్తారు.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మూడేళ్ల పదవీకాలంలో మీకు సంతృప్తినిచ్చిన అంశం?పార్టీ క్రియాశీలకంగా ఉండేలా చేయడం, సంస్థాగతంగా పనిచేయడం. నా వల్ల అని చెప్పడం లేదు కానీ, కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. బ్రహ్మాండమైన పార్టీగా టీఆర్‌ఎస్‌ ఎదిగింది. అజేయమైన శక్తిగా ఢిల్లీ వరకు విస్తరించింది. రెండు జాతీయ పార్టీలు కలిసి పనిచేస్తే తప్ప మమ్మల్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు. పొత్తులు పెట్టుకుని మరీ మాతో తలపడుతున్నారు. 
టీఆర్‌ఎస్‌కు బీజేపీ పోటీ కాదని చెబుతూనే ఆ పార్టీపై విమర్శలు ఎందుకు? బీజేపీ మంచి పార్టీ కాదని మాకు ముందే తెలుసు. వాళ్లకు మతపిచ్చి ఎక్కువ. దేశాన్ని చెడగొడతారనీ తెలుసు. కొత్త రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం.. మాకెందుకు గొడవ అనుకున్నాం. సన్నిహితంగా ఉంటే రాష్ట్రానికి లాభమని అనుకున్నాం. అదేం జరగలేదు. బీజేపీతో ఇప్పటికీ ఫ్రెంఢ్లీగానే ఉన్నాం. వాళ్లతో మాకు వ్యక్తిగత  పంచాయితీల్లేవు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రలో ఉండి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సింది పోయి గుజరాత్‌కే ప్రధాన మంత్రిలాగా, అంబానీ, అదానీకే మిత్రుడు అన్నట్లుగా మోదీ వ్యవహరిస్తున్నారు. 

బీజేపీ హిందూత్వ నినాదాన్ని తప్పుబడుతున్నారా? అలాంటిదేమీ లేదు. ఆ పేరుతో.. వాళ్లు నిరుద్యోగ సమస్య మీద మాట్లాడరు. సమస్యలను పక్కదారి పట్టిస్తారు. ప్రశ్నిస్తే.. హలాల్‌, పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌, చైనా అంటూ మాట్లాడతారు. వాళ్ల హిందూత్వమేంది? మేం హిందువులం కాదా? బీజేపీ అధికారంలోకి రాకముందు మేం దేవుళ్లను మొక్కలేదా? గుళ్లకు పోలేదా? బొట్టుపెట్టుకోలేదా? బీజేపోళ్లు దేవుళ్లను రాజకీయం కోసం వాడుకునే హిందువులు. మాది ధార్మికత. అద్భుతంగా యాదాద్రిని పునర్‌నిర్మించాం. ఇక తెలంగాణలో జైశ్రీరాం అనే అర్హత బీజేపీకి లేదు. భద్రాచలం రాముడికి పైసా అయినా ఇచ్చారా? అయోధ్య రాముడే.. రాముడా! రాజకీయం కోసమే దేవుడిని వాడుకుంటాం. ప్రజలను రెచ్చగొట్టడానికే మతాన్ని వాడుకుంటామంటే వారి డొల్లతనాన్ని ప్రజల ముందు ఎండగడుతాం. 

వరి పోరులో రైతుల మద్దతు కూడగట్టడంలో టీఆర్‌ఎస్‌ ఎందుకు విఫలమైంది? మాది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ముద్రవేయడానికి కాంగ్రెస్‌, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. రైతులతో ఆందోళనలు చేయించడం, శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం, ఇద్దరు, ముగ్గురు రైతులు చనిపోయేట్లు చేసి శవాలతో రాజకీయాలు చేయాలనుకోవడమే ఆ పార్టీల అజెండా. దానిని తిప్పికొట్టడానికే రైతన్నకు అండగా నిలవాలనుకున్నాం. 

తెలంగాణలోనూ అధికార పార్టీ నేతల ఆగడాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ మీ దృష్టికి వస్తున్నాయా?ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎక్కడ తప్పు జరిగినా బాధ్యులకు శిక్షపడుతోంది. రామాయంపేట ఘటనలో మా మున్సిపల్‌ చైర్మన్‌ అరెస్ట్‌ అయ్యాడు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని నేరాలకు పాల్పడిన వారిని ఉపేక్షిస్తే తప్పు. తప్పు జరగగానే కచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం. లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై మోదీ ఒక్క మాటైన మాట్లాడారా? క్షమాపణ అయినా చెప్పారా? ఇక ఎమ్మెల్యేలందరూ వెధవ పనులు చేస్తున్నారని మాట్లాడడం మంచిది కాదు. ఎక్కడో ఒక్క ఎమ్మెల్యే తప్పు చేస్తే పార్టీ మొత్తం  చేసినట్లా? తప్పు జరిగిన తర్వాత కఠినంగా వ్యవహరిస్తున్నాం. బుద్ధి చెబుతున్నాం. మళ్లీ అలా చేయొద్దని హెచ్చరిస్తున్నాం. మారకపోతే నిర్ణయాలు వేరుగా ఉంటాయి.
గవర్నర్‌కు ప్రొటోకాల్‌ పాటించడం లేదనే విమర్శలకు ఏం చెబుతారు?ఆమె గవర్నర్‌లాగా వ్యవహరిస్తే, రాజ్‌భవన్‌.. రాజ్‌భవన్‌లాగా ఉంటే కచ్చితంగా గౌరవం దొరుకుతుంది. రాజకీయ భవన్‌ చేస్తా. బీజేపీ హెడ్‌ ఆఫీస్‌ చేస్తానంటే జరగాల్సినది జరుగుతుంది. నిన్నమొన్నటి దాకా తమిళనాడు బీజేపీ చీఫ్‌గా పనిచేసిన ఆమెను తీసుకువచ్చి గవర్నర్‌ను చేస్తే ఆ వాసన ఎలా పోతుంది? ఇంకో 15 రోజులు ఫైల్‌ నా దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వం పడిపోయేదని అనొచ్చా? 88 మంది ఎమ్మెల్యేలతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతాననే మాట అనొచ్చా? అది గవర్నర్‌ మాటనా? బీజేపీ కార్యకర్తల మాటనా? రిపబ్లిక్‌ డే గవర్నర్‌ ప్రసంగాన్ని కేబినేట్‌ ఆమోదించాలి. అదే గవర్నర్‌ మాట్లాడాలి. కానీ, గవర్నర్‌.. మోదీ ప్రభుత్వం తెలంగాణకు మెడికల్‌ కాలేజీలు ఇచ్చిందని మాట్లాడారు. ఒక బీజేపీ నాయకురాలిగా ఆమె పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చా? బెంగాల్‌ సీఎం మమతా  మహిళ కాదా? గవర్నర్‌ ఆమెను ఎందుకు సతాయిస్తున్నారు? సీఎం కేసీఆర్‌ను సోషల్‌ మీడియాలో నోటికి వచ్చినట్లు మాట్లాడినప్పుడు, తప్పుడు పోస్టులు పెట్టినప్పుడు.. ఇప్పుడు మాట్లాడుతున్న దద్దమ్మలంతా ఎక్కడికి పోయారు? ఒకవైపు మాత్రమే భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందా? గౌరమిస్తేనే తిరిగి దొరుకుతుంది. నేను గౌరవం ఇవ్వను. ఎదుటి వాళ్లే ఇవ్వాలనడం సరికాదు.
కేసీఆర్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ అవసరం ఏమిటి?ప్రశాంత్‌ కిశోర్‌ టీఆర్‌ఎ్‌సకు మాత్రమే కాదు. 10, 15 పార్టీలతో పనిచేస్తున్నారు. 2014కు ముందు మోదీతో కూడా పనిచేశారు. మమతా బెనర్జీ, స్టాలిన్‌, జగన్‌తో పనిచేశారు. కాంగ్రె్‌సతో కూడా పనిచేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మేం చాలా మంది వ్యూహకర్తలను కలిశాం. కేసీఆర్‌ను మించిన వ్యూహకర్త ఎవరూ లేరన్నది వాస్తవం. కానీ, ప్రస్తుత సమాజంలో మార్పులను గమనంలోకి తీసుకోవాలి. 

పీకే కాంగ్రెస్‌ లీడర్‌గా, టీఆర్‌ఎస్‌ వ్యూహకర్తగా ఉండడాన్ని ఎలా చూస్తారు?కాంగ్రెస్‌ దేశంలో చచ్చిపోయిన పార్టీ. 50 ఏళ్లు ప్రజలు అధికారం ఇచ్చినా ఏమీ చేయలేదు. అది బతికి ఉందని ఎవరికైనా విశ్వాసం ఉంటే, అది వారి విజ్ఞత. అటువంటి పార్టీకి ప్రాణ ప్రతిష్ట చేస్తా.. పీనుగును తిరిగి కూర్చోపెడుతా అని ఎవరైనా అనుకుంటే, ఏమీ చేయలేం.  ప్రశాంత్‌ కిశోర్‌ టీఆర్‌ఎస్‌ వ్యూహకర్త అని ఎవరు చెప్పారు? ఆయన గతంలో ఏర్పాటు చేసిన ఐప్యాక్‌ సంస్థ టీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తోంది. మీడియా కానీ, స్ట్రాటజి్‌స్టలు గానీ మాలో సరుకు లేకపోతే ఏమీ చేయలేరు. టీఆర్‌ఎస్‌ బలమైన పార్టీ. ఆయన అద్భుతాలు చేస్తారని కాదు. చాన్స్‌ తీసుకోవద్దనే ఈ ప్రయత్నం. అట్లంటే మోదీ, మమత, స్టాలిన్‌ గెలిచే పరిస్థితి లేక ప్రశాంత్‌ కిశోర్‌ను తెచ్చుకున్నారా?

అభివృద్ధి గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లకే పరిమితమవుతోందనే విమర్శలకు మీ సమాధానం?మిషన్‌ భగీరథ, 24 గంటల విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా.. పథకం ఏదైనా రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నాం. గుజరాత్‌ మాత్రమే అనే దృష్టితో చూసే భావ దారిద్య్రం మాకు లేదు. కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌ ఉండడంతో గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లకు మీడియా ప్రాధాన్య ం ఇస్తోంది. మిగతా నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి జరుగుతోంది. అంతటా సిరిసిల్ల కన్నా ఎక్కువే అభివృద్ధి జరిగింది.

111 జీవో రద్దుపై విమర్శలున్నాయి కదా?2007లోనే 111 జీవోను ఎత్తేయాలని వైఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ కూడా వాగ్దానం చేశాయి. 2018లోనూ రద్దు చేస్తామని చెప్పాం. ఎప్పుడో చెప్పిన మాటను నిలబెట్టుకుంటే తప్పేంటి?

కేసీఆర్‌ ప్రధానిని దద్దమ్మ అంటే, మీరు బట్టేబాజ్‌ అనగలనని కామెంట్‌ చేశారు. ఎందుకిలాంటి వ్యాఖ్యలు?కేసీఆర్‌ కాలి గోటికి సరిపోని నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిన్నమొన్న సున్నాలు వేసుకుంటూ తిరిగిన వ్యక్తి చాలా పెద్దవాడినైపోయినా అనుకుని విమర్శిస్తున్నారు. కరీంనగర్‌లో తంబాకు నములుతూ, ఛాయ్‌ బండి దగ్గర కూర్చున్న వ్యక్తి అడ్డిమార్‌ గుడ్డి దెబ్బతో లీడర్‌ అవగానే చాలా పెద్దగా ఊహించుకుని మాట్లాడుతున్నారు. మా నాయకులు, కార్యకర్తల్లో చాలా కోపం ఉంది. సంయమనం పాటిస్తున్నాం. మోదీని తిట్టడం పెద్ద విషయమా..? మా నాయకుడు సంస్కారం నేర్పారు కాబట్టి అనడం లేదు. ఇప్పటికైనా వాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకొని, నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఒకవేళ వినకపోతే, పద్ధతి మారకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బలా సమాధానం చెబుతాం. మీడియా కూడా మంచి మాటలు మాట్లాడితే చూపించడం లేదు. కేవలం బూతులు తిడితే మొదటి పేజీలో వేస్తున్నారు. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది.