అక్టోబర్‌లో రాష్ట్రానికి రానున్న రాహుల్‌

వచ్చే నెల ఏడోతేదీ నుంచి ప్రారంభం కానున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’అక్టోబర్‌ చివరి వారంలో మన రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా నుంచి తెలంగాణకు రానున్న రాహుల్‌ పాదయాత్ర రాష్ట్రంలోని ఏడు నియోజకవర్గాలను కలుపుతూ మహా­రాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాల్లోకి ప్రవేశించేవిధంగా రూట్‌మ్యాప్‌ రూపొందించారు.

అక్టోబర్‌ 23 తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించే ఈ యాత్ర మొత్తం 12 రోజులపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల మీదుగా రాష్ట్రంలో దాదాపు 300–350 కిలోమీటర్ల మేర ప్రయాణించిన తర్వాత మహారాష్ట్రకు చేరుకుంటుందని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. రాయచూర్‌ మీదుగా నారాయణపేట నియోజకవర్గంలోకి రానున్న రాహుల్‌యాత్ర కొడంగల్, పరిగి, వికారా­బాద్, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, జుక్కల్‌ నియోజకవర్గాల మీదుగా సాగనుంది.

జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుంద, మద్నూరు మీదుగా మహారాష్ట్రలోని డిగ్లూర్‌కు వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మార్పు జరిగితే జుక్కల్‌లో ప్రవేశించిన తర్వాత బాన్సువాడ, బోధన్‌ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే అవకా­శముంది. యాత్రకు సంబంధించిన షెడ్యూ­ల్‌ గురించి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ బుధవారం గాంధీభవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క­తోపాటు మరికొందరు ముఖ్యనేతలు ఈ సమీక్షలో పాల్గొంటారని, రాహుల్‌ పాదయాత్ర రూట్‌మ్యాప్‌ పూర్తిస్థాయిలో ఖరారు చేస్తారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. వచ్చేనెల ఏడో తేదీన తమిళ­నాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభం కాను­న్న ఈ యాత్ర దేశవ్యాప్తంగా 150 రోజులపాటు 3,500 కిలోమీటర్లకుపైగా సాగనుంది. కేరళలో 19 రోజులు, కర్ణాటకలో 21 రోజుల తర్వాత తెలంగాణలో 12 రోజులపాటు ఈ యాత్ర జరగనుంది.