పార్కుల్లో అడ్వెంచర్స్‌!

పార్కులంటే కేవలం పచ్చదనం, ఆహ్లాదమే కాదు.. అడ్వెంచర్స్‌కు కేరాఫ్‌గా మారనున్నాయి. ఆ విధంగా శివారు పార్కులను తీర్చిదిద్దనున్నారు. వారాంతంలో పార్కులను సందర్శించడానికి ఇప్పటికే శివారులోని 16 అర్బన్‌ ఫారెస్టు పార్కులను హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సిద్ధం చేయగా, ఆరు వరకు అందుబాటులోకి వచ్చాయి. మరో తొమ్మిది పార్కులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పార్కుల్లో నగరవాసులకు ఆసక్తి కలిగించేలా అడ్వెంచర్స్‌ ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ నిర్ణయించారు.

ఈ మేరకు స్పెషల్‌ సీఎస్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ మార్గదర్శకత్వంలో అర్బన్‌ ఫారెస్టు పార్కుల్లో జిప్‌లైన్‌, స్కై సైక్లింగ్‌ లాంటివి ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. జిప్‌లైన్‌ నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ట్విటర్‌లో ఒకరు కోరడంతో ఇప్పటికే చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్‌ బదులిచ్చారు.ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ప్రయాణం చేసే వాహనదారులకు ఏ వైపు చూసినా పచ్చదనం కనిపించేలా శివారులోని అటవీ భూములను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సుమారు రూ.93కోట్లను కేటాయించి 16 బ్లాక్‌లను వివిధ రకాల థీమ్‌లతో అభివృద్ధి చేశారు. అంబర్‌పేట కలాన్‌తోపాటు నాగారం, పల్లెగడ్డ, సిరిగిరిపూర్‌, శ్రీనగర్‌, తుమ్మలూర్‌, మన్యకంచె ప్రాంతాల్లో ఇప్పటికే అర్బన్‌ ఫారెస్టు పార్కులు అందుబాటులోకి వచ్చాయి. నగరవాసులు కుటుంబ సమేతంగా ఆహ్లాదకర వాతావారణం పొందేలా ఈ ఫా రెస్టు బ్లాక్‌లను తీర్చిదిద్దారు.

మయూరి ఎకో పార్కు తరహాలోమహబూబ్‌నగర్‌ జిల్లాలోని మయూరి ఏకో పార్కు స్థానికులతో పాటు నగరవాసులు, ఇతర రాష్ట్రాల సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అడ్వెంచర్స్‌ కోసం వీకెండ్‌ సందడిగా మారుతోంది. అదే తరహాలో నగర శివారులో అడ్వంచర్స్‌ ఉండేవిధంగా పార్కులను తీర్చిదిద్ధడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని బొంతపల్లిలో 25ఎకరాల్లో అడవికి ఇబ్బందుల్లేకుండా గ్లాంపింగ్‌ సైట్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఎతైన గుట్టల నుంచి జిప్‌లైన్‌, స్కై సైక్లింగ్‌ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. 

స్కై సైక్లింగ్‌ : రెండు ఎత్తైన ప్రదేశాల నుంచి సమాంతరంగా రెండు బలమైన వైర్లను ఏర్పాటు చేస్తారు. పై వైరుకు రైడర్‌ లింక్‌ అయ్యి ఉండగా, కింది వైరుకు సైకిల్‌ లింకు అయ్యి ఉంటుంది. సైకిల్‌ తొక్కుతుంటేనే ముందుకు కదులుతుంది. 

జిప్‌లైన్‌ : ఒక ఎతైన ప్రదేశం నుంచి దిగువన ఉన్న ప్రదేశం వరకు ఒక బలమైన వైరు ఏర్పాటు చేస్తారు. ఈ జిప్‌లైన్‌కు భద్రత పరికరాల సహాయంతో రైడర్‌ వేలాడుతూ వెళ్తుంటారు. పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతతోనే రైడర్‌ను పంపుతారు. దిగువకు వెళ్లే క్రమంలో స్పీడ్‌గా కానీ, నిదానంగా కానీ వెళ్లడమనేది రైడర్‌ చేతిలోనే ఉంటుంది.