సైబరాబాద్‌ పరిధిలో మరో 12 కొత్త పోలీస్‌ స్టేషన్లు..

Cyberabad: హైదరాబాద్ మహానగరంలో మూడు పోలీస్ కమిషనరేట్లు ఉండగా.. అందులో సైబరాబాద్ కమిషనరేట్ అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్టే.. జనాభా, విస్తీర్ణం, నేరాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. శాంతి భద్రతలను కాపాడేందుకు కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 32 పోలీస్ స్టేషన్లు ఉండగా.. కొత్తగా మరో 12 ఠాణాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు.

Cyberabad: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్‌ (Hyderabad) లో శాంతి భద్రతలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. మహానగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో లా అండ్ ఆర్డర్‌ (Law and Order) ను కాపాడేందుకు పోలీసులకు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తోంది. ఇటీవలే.. ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ (Police Command Control Center) ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాగా.. ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Cyberabad Police Commissionerate) పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

3,644 చదరపు కిలోమీటర్లలో 29 రెవెన్యూ మండలాలు, 3 లా అండ్‌ ఆర్డర్‌ జోన్స్‌, 9 లా అండ్‌ ఆర్డర్‌ డివిజన్స్‌ 36 పోలీస్‌ స్టేషన్‌లతో సైబరాబాద్‌ విస్తరించి ఉంది. సైబరాబాద్‌లో కొత్తగా మరో 12 పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జనాభా, విస్తీర్ణం, నేరాల సంఖ్య లాంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని.. ప్రస్తుతం ఉన్న పోలీస్‌ స్టేషన్లలో కొన్నింటి విభజించి, అదనంగా మరికొన్ని ప్రాంతాలను చేర్చి కొత్త పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. రాచకొండ కమిషనరేట్‌లోనూ కొత్త పోలీస్‌ స్టేషన్‌ల ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే కొత్త పోలీస్‌ స్టేషన్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కొత్త పోలీస్ స్టేషన్లు ఇక్కడే..
దుండిగల్‌ పరిధిలో సూరారం, పేట్‌బషీరాబాద్‌ పరిధిలో గుండ్లపోచమ్మ, మేడ్చల్‌తో పాటు మేడ్చల్‌ రూరల్‌, ఆర్‌సీపురం పరిధిలో కొల్లూరు, మాదాపూర్‌ పరిధిలో కొండాపూర్‌, శామీర్‌పేట పరిధిలో ముచ్చింతల్‌, నిజాంపేట పరిధిలో బాచుపల్లి, ఆర్జీఐ పోలీస్ స్టేషన్‌ పరిధిలో కొత్తగా ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది.